దేశంలోనే భారీ సంక్షేమం

5

– ప్రజల ఆశీర్వాదం కావాలి

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): పేదల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కెటి  రామారావు అన్నారు. నాలుగేళ్లలో పేదలందరికి పక్కా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కట్టించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ యేడాదిలోనే నగరంలో పది వేల ఇండ్లు కట్టించి పేదలకు ఇస్తున్నామని తెలిపారు.  ఇండ్ల కోసం ఎవరైనా దళారులు వస్తే వాళ్ల మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వమే అందరిని గుర్తించి ఇండ్లను కట్టించి ఇస్తుందన్నారు.

నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన దీపం పథకం కార్యక్రమాన్ని  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి తలసాని, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..  గత ప్రభుత్వాలు పక్కా ఇండ్లు అని చెప్పి రూ.10 వేలు వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరంలేదని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.7 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇస్తుందని వివరించారు. ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పించామన్నారు. పెన్షన్‌, షాదీ ముబారక్‌ వంటి పథకాలను కూడా పేదల కోసం ప్రవేశపెట్టామని వివరించారు. కానీ మొన్నటి దాక మంత్రులుగా ఉన్నవాళ్లే ఇవాళ తమ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం ఇంత చేస్తోన్న తమ ప్రభుత్వం కోసం ప్రజలు సహకరించాలని కోరారు. అవసరమచ్చినపుడు ప్రభుత్వాన్ని ఆదుకోవడం బాధ్యత అని గుర్తు చేశారు. మొన్న అధికారం ఇచ్చారు కాబట్టే ఇవాళ మంత్రులుగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నామని పేర్కొన్నారు. మళ్లీ అవసరమచ్చినపుడు ప్రభుత్వాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించండని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని కేటీఆర్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 75వేల కొత్త గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేశామని, భవిష్యత్తులో మరిన్ని కొత్త గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేస్తామని హావిూ ఇచ్చారు. 18నెలల తెరాస పాలనలో మహిళా సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలు, వయో వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కులంతో నిమిత్తం లేకుండా పేద ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని

వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట ఆడపిల్లల కోసం రూ.51వేలు చొప్పున్న ఇస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.  పేదల సంక్షేమం కోసం గత 18 నెలల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇవాళ 8 వేల 6 వందల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు పత్రాలు ఇస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరడిగినా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళా సంఘాలకు ప్రస్తుతం రూ.5 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను రూ.10 లక్షల వరకు చేసే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని వెల్లడించారు. మహిళలకు సీఎం పెద్దపీఠ వేసి గౌరవిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు బ్యాంకు రుణాలు, వంటగ్యాస్‌ ధ్రువీకరణ పత్రాలను మంత్రుల చేతుల విూదుగా పంపిణీ చేశారు.

హైదరాబాద్‌ మేయర్‌ పీఠం తెరాసదే: నాయిని

హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని తెరాస పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు సైతం తెరాసకు ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రావారు సంక్రాంతికి వెళ్లినప్పుడు ఎన్నికలు జరుగుతాయనడం నిజం కాదని నాయిని స్పష్టం చేశారు. నగరంలో ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు.రాష్ట్రంలోని మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పలు పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పేదల సమస్యలు తెలుసన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టారని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు. అందుకే ప్రతీ పేదవాడికి ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కట్టిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం రూ.10 వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఎవరూ ఇండ్ల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వనక్కర్లేదన్నారు. ప్రభుత్వమే పేదల వద్దకు వచ్చి ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. సమైక్య పాలనలో హుస్సేన్‌సాగర్‌ మురికి కూపమైందని విమర్శించారు. త్వరలో దీనిని శుభ్రపరిచి నగరానికి మంచినీటిని అందించే సరస్సుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేపట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. విమర్శలను ప్రభుత్వం పట్టించుకోకుండా పేదల సంక్షేమం కోసం ముందుకు వెళ్లుందని వివరించారు.