దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కేసులు


35,178 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్రం వెల్లడి
కర్నాటకలో కరోనానంతర పరీక్షల్లో టిబి టెస్ట్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోద య్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. మరో 440 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లో 55,05,075 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 56,06,52,030 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మొత్తం 49.84 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు తెలిపింది. ఇదిలావుంటే కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తులకు ప్రత్యేకంగా టీబీ టెస్ట్‌ డ్రైవ్‌ చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో 28 లక్షల మందికిపైగా కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి అనంతరం క్షయ (టీబీ) లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి.దీంతో టీబీని ముందుగానే గుర్తించేందుకు వీలుగా ఈ నెల 16 నుంచి ఆగస్టు 31వతేదీ వరకు టీబీ టెస్ట్‌ డ్రైవ్‌ చేపట్టామని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె సుధాకర్‌ చెప్పారు. టీబీని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని అందుకే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీబీ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సుధాకర్‌ కోరారు. 2017 నుంచి 75 లక్షల టీబీ అనుమానిత కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి సోకిన వారిలో 3.9 శాతం మంది టీబీతో బాధపడుతున్నారని గుర్తించారు. దీంతో ముందుగా గుర్తించేందుకు టీబీ టెస్ట్‌ డ్రైవ్‌ చేపట్టామని మంత్రి సుధాకర్‌ వివరించారు.