దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

 

కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే..
కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష..
రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే
సీఎం కేసీఆర్ అంబేద్కర్ సాక్షిగా క్షమాపణ చెప్పాలి.. తక్షణమే రాజీనామా చేయాలి..
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్
కరీంనగర్ ఫిబ్రవరి 4 (జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మతిభ్రమించి  రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని, దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి చేసిన ద్రోహాన్నీ కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని కాదు, రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని, ముఖ్యమంత్రి పదవి కెసిఆర్ కు రాజ్యాంగం పెట్టిన  భిక్షేనని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి  అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని  కెసిఆర్  కోరడం  ఆయన  నిజ స్వరూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని  చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ సోయి లేకుండా  మతిభ్రమించి మాట్లాడుతున్నారని , రాజ్యాంగాన్ని మార్చాలి అనడం  కెసిఆర్ అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కెసిఆర్ మార్చాలనడం ఆయన దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం లాంటిదన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ దళిత ముఖ్యమంత్రి పదవి, దళితులకు 3 ఎకరాల భూమి, హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళిత బంధు లాంటి అనేక హామీలను అమలు చేయలేక కెసిఆర్  దళిత సమాజాన్ని నిరంతరం  మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా దళిత రాష్ట్రపతి  ప్రసంగాన్ని  టిఆర్ఎస్ బహిష్కరించడం, దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్  తెచ్చిన రాజ్యాంగాన్ని  మార్చాలని  కోరడం   లాంటి అంశాలు   కెసిఆర్   దళిత వ్యతిరేక విధానాలకు  అద్దం పడుతోందన్నారు . దళితుల పట్ల కేసీఆర్ వైఖరి ఏంటో దీంతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కెసిఆర్ రాజకీయ జీవితంలో  రాజ్యాంగం పెట్టిన బిక్ష తో ఎన్నో  పదవులు అనుభవించారని, అలాంటప్పుడు  రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఏంటో కెసిఆర్ స్పష్టం చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.  కెసిఆర్ కు తెలంగాణ కళ సాకారం కోసం ఉద్యమాలు చేయడానికి ఆ హక్కులు కల్పించిందని, రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ద్వారాలు తెరిచిందని, ఆ ఆర్టికల్ ప్రకారం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ని ముఖ్యమంత్రిని  చేసిందనే విషయం  మర్చిపోవద్దన్నారు.ముఖ్యమంత్రి పదవి స్వీకరించేటప్పుడు  రాజ్యాంగపై ప్రమాణం చేసి  రాజ్యాంగ విలువలను కాపాడుతానని ప్రజలకు చెప్పి నేడు ఆ రాజ్యాంగాన్నే మార్చలనడం కెసిఆర్ నీతి మాలిన తనానికి నిదర్శనం లాంటిదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బేషరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి  తీసుకొని దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితులను, గిరిజనులను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. సీఎం గా కేసీఆర్ కు కొనసాగే నైతిక హక్కు లేదని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే. సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,  చొప్పదండి కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం, నాయకులు ఎండి తాజ్, లింగంపెల్లి బాబు, ఖమరుద్దీన్, విక్టర్, ఏజ్రా, నిహల్ తదితరులు పాల్గొన్నారు.