దేశంలో 100 స్మార్ట్‌ సిటీలు

4
– తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు

– రూ.100 కోట్ల వ్యయంతో ఒక్కో సిటీ

– వెంకయ్య వెల్లడి

న్యూఢిల్లీ,ఆగష్టు 27 (జనంసాక్షి):

స్మార్ట్‌ సిటీల జాబితా విడుదలయ్యింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు పట్టణాలకు చోటు దక్కింది. వీటిలో తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు పట్టణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కాకినాడ, తిరుపతి, తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌ను స్మార్ట్‌సిటీలుగా ఎంపికయ్యాయి. దేశంలో వంద స్మార్ట్‌ సిటీల జాబితాను గురువారం విడుదల చేశారు. వీటిని ప్రత్యేక నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తారు. రాబోయే ఆరేళ్ళలో స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి 3 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో స్మార్ట్‌ సిటీకి 100 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఆకర్షణీయ నగరాలతో అభివృద్ధి పరుగులు పెడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీల జాబితాను విడుదల చేశారు.  అత్యధికంగా యూపీ నుంచి 14 నగరాలు, తమిళనాడు నుంచి 12, మహారాష్ట్ర నుంచి 10, మధ్యప్రదేశ్‌ నుంచి 7, గుజరాత్‌, కర్ణాటకల నుంచి 6 చొప్పున నగరాలను ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు. బీహార్‌ రాష్ట్రంలో మూడు నగరాలు ఎంపిక చేశామని వెంకయ్యనాయుడు వివరించారు. స్మార్ట్‌సిటీలో తగినంత నీటి సరఫరా ఉంటుందని, నిరంతరాయం విద్యుత్‌ సరఫరా ఖాయమని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తమని వెంకయ్య తెలిపారు. పేదలకు గృహవసతి అందుబాటులో ఉంచుతామని…ఐటీ కనెక్టివిటీ ఉంటుందన్నారు. సుపరిపాలన అందించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈగవర్నెన్స్‌కు ఈ సిటీల్లో ప్రాధాన్యమిస్తామని, అన్ని రంగాల్లో పౌరుల భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. .2011 జనాభా లెక్కల ప్రకారం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు. రాబోయే ఆరేళ్లలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నగరాల పేర్ల ప్రతిపాదనకు జమ్ముకశ్మీర్‌ సమయం అడిగిందని తెలిపారు.ఈ ఉదయం విడుదల చేసిన స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణా నుంచి రెండు నగరాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఒకటి రాజధాని హైదరాబాద్‌ కాగా, మరొకటి వరంగల్‌. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలు స్మార్ట్‌ సిటీలుగా ఎంపికయ్యాయి. దీంతో కరీంనగర్‌తో పాటు నిజామాబాద్కోసం ఎంపిలు చేసిన కృషి ఫలించలేదు. అలాగే ఆంధ్రాలోనూ విజయవాడ, గుంటూరులను ప్రతిపాదించినా వాటికీ చోటు దక్కలేదు.  ఉత్తర ప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 14 నగరాలు ఎంపిక చేసారు. విస్తర్ణపరంగా పెద్ద స్టేట్‌ కావడంతో ఎక్కువ నగరాలను ఎంపిక చేశారు.