దేశాన్ని ఆకర్శిస్తున్న రైతుబంధు  పథకం

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: పోచారం
కామారెడ్డి,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద బ్యాంకులకు నిధులు మంజూరు చేసి,చెక్కుఉల ఇవ్వగానే డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సిఎం కెసిఆర్‌ రైతుల పట్ల చిత్తశుద్దిని చాటారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.
ఈ పథకం శరవేగంగా ముందుకు సాగుతున్న తీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు.   ఇదొక్కటే కాకుండా మొత్తంగా టిఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న  ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రముఖులు రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నారని అన్నారు. పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.  రైతు కన్నీళ్లు తుడిచేందుకు చేపట్టిన ఈ చారిత్రక చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సర్కారు ఇప్పటికే ఎనిమిది జాతీయ బ్యాంకులను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేసిందన్నారు.  ఈ చెక్కులు పొందిన రైతులు రాష్ట్రంలోని ఏ బ్యాంకు ఖాతాలోనైనా నగదును విడిపించుకోవచ్చన్నారు. . తమకున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఈ సాయాన్ని
విత్తనం, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు నిమిత్తం కర్షకులు ఖర్చు చేసుకోవచ్చు. ఇదిలావుంటే
ప్రభుత్వం రైతుబంధు పథకంలో చెక్‌ పవర్‌ను ప్రభుత్వ స్థాయిలోనే పరిమితం చేయడంతో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడినట్లు అయ్యింది. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ భూమి, ఇతర భూములు ఎంత ఉన్నాయో లెక్క తీసింది. భూముల వివరాలను ఎల్‌ఆర్‌యూసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. రైతుల ఆధార్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను సైతం సేకరించి వెబ్‌సైట్‌లో నమోదు చేయించింది. భూమి ఆధారంగా రైతుకు అందించాల్సిన డబ్బులను చెక్కులపై ముద్రించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చెక్కుపై రైతు పేరు, అతని తండ్రి పేరు, పెట్టుబడి సాయం అందించే డబ్బుల వివరాలు ముద్రించి ఇవ్వనుంది. ఇక రైతుకు వేర్వేరు గ్రామాలు, వేర్వేరు జిల్లాల్లో భూములు ఉన్నట్లయితే అక్కడ జరిగే గ్రామ సభలకు వెళ్లి చెక్కులు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిపోయిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి పంపించాల్సిందే. వానాకాలం పంటకు ఎకరాకు రూ.4వేల చొప్పున సుమారు రూ.180 కోట్లు వరకు రైతులకు చెక్కుల రూపేణా అందనుంది. ఈ నెలలో రెండు దఫాలుగా అన్ని గ్రామాల్లోనూ చెక్కులను ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతుబంధు పథకం కింద తొలి విడతలో ఏక కాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పోచారం వివరించారు. ఇందుకోసం గ్రామాల్లో పండగవాతావరణం నెలకొందన్నారు.
———-