దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ సైతం 22,774.85 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో రెండు బెంచ్ మార్క్ సూచీలు కోలుకున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
సెన్సెక్స్ ఉదయం 76,388.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,138.97 ) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 75,439.64 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 199 పాయింట్ల నష్టంతో 75,939.21 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 102.15 పాయింట్ల నష్టంతో 22,929.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 86.84 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.44 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు మరింత పెరిగి 2960 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. 3 వేల డాలర్ల మార్కుకు కాస్త దూరంలో నిలిచింది.
కారణాలు ఇవే..
- భారత్ మిత్ర దేశమైనా పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోనని ట్రంప్ సున్నితంగా తేల్చి చెప్పారు. భారత్ సహా ఇతర దేశాలపై పరస్పర పన్నులు తప్పవని ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై గట్టి ప్రభావమే చూపాయి.
- అటు విదేశీ సంస్థాగత మదుపర్లు విక్రయాలు కొనసాగుతుండడం మార్కెట్ల పతనానికి కారణమవుతున్నాయి. డాలర్ విలువ, అమెరికా బాండ్ రాబడులు తగ్గితేనే ఈ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
- ప్రధాన కంపెనీలు సైతం మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించకలేకపోవడం మార్కెట్ల నష్టాలకు మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు.