దోషులెవరైనా వదిలిపెట్టం

హెలిక్యాప్టర్ల కుంభకోణంపై నోరు విప్పిన ఆంటోని
సీబీఐ నివేదిక తర్వాత చర్యలు
ఒప్పందం రద్దు దిశగా అడుగులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) :
హెలిక్యాప్టర్ల కొనుగోలు అక్రమాలకు పాల్పడిన దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి ఏకో ఆంటోని అన్నారు. కుంభకోణంపై విపక్షాల ఆరోపణలు, ముప్పేట దాడి నేపథ్యంలో బుధవారం ఆయన నోరు విప్పారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం భారత అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు భారీగా లంచాలు ముట్టాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అక్రమాలకు పాల్పడిన వారినెవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అవినీతి జరిగినట్లు తేలితే ఒప్పందాన్ని రద్దు చేసేందుకూ వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై మంగళవారమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆంటోనీ వెల్లడించారు. ఈ వ్యవహారంపై త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. వీవీఐపీల అవసరాల కోసం కొనుగోలు చేయాలని భావించిన హెలికాప్టర్ల కాంట్రాక్ట్‌ కోసం భారత అధికారులకు, ప్రముఖులకు రూ.362 కోట్లు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆంటోనీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్ట బోమని ప్రకటించారు. ‘నేను జడ్జిని కాదు. దర్యాప్తు చేపట్టాలని నిన్న సీబీఐని ఆదేశించా. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని కోరా. సీబీఐ దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ‘ఇప్పుడే ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేం. ఎవరెవరు కంపెనీలను ప్రభావితం చేశారనేది సీబీఐ దర్యాప్తులో తేలుంది. ఒప్పందంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలితే.. ఎవరినీ ఉపేక్షించేది లేదు. భారతీయులు.. విదేశీయులు.. ఎవరైనా సరే. ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని అన్నారు. విక్రయ సంస్థ అధికారులకు లంచాలు ముట్టజెప్పినట్లైతే సీబీఐ విచారణలో తేలుతుందన్నారు. ‘ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అవసరమైతే ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తాం. అయితే, సీబీఐ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయి’ అని తెలిపారు. రక్షణ శాఖ కొనుగోళ్లలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. సీబీఐ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆరు సంస్థలను బ్లాక్‌ లిస్టులో పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగిపై ఆరోపణలకు సంబంధించి సమాచారం లేదని తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర వీవీఐపీల అవసరాల కోసం 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయించింది. ఈ మేరకు 2010 ఫిబ్రవరిలో వైమానిక దళానికి, ఇటలీకి చెందిన ‘ఫిన్‌మెకానిక’ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి ఆర్థిక శాఖ అంగీకరించక పోయినా.. కేంద్ర క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. తమ సంస్థకు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ త్రీ ఇంజిన్‌ ఏడబ్ల్యూ-101హెలికాప్టర్లను విక్రయిస్తానని ఫిన్‌మెకానిక ప్రకటించింది. మరోవైపు, అమెరికాకు చెందిన సికోర్‌స్కై అనే సంస్థ కూడా విక్రయించేందుకు ముందుకు వచ్చింది. రూ.3,600 కోట్లు విలువైన ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకొనేందుకు ఫిన్‌మెకానిక ముడుపులు ముట్టజెప్పినట్లు సమాచారం. కాంట్రాక్ట్‌ మొత్తంలో పది శాతం (రూ.362 కోట్లు) భారత అధికారులకు, ఇతర ప్రముఖులకు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణంపై ఇటలీ అధికారులు విచారణ చేపట్టారు. సంస్థ చైర్మన్‌ను మంగళవారం అదుపులోకి తీసుకొని, ఆయన కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. దీంతో రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఒప్పందం మేరకు ఇప్పటికే కాంట్రాక్టులో 30 శాతం నిధులు చెల్లించారు. ఆ మేరకు మూడు హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. మిగతా నిధులు చెల్లించగానే.. మిగిలిన తొమ్మిది హెలికాప్టర్లు రావాల్సి ఉంది. అయితే, తాజా ఆరోపణల నేపథ్యంలో.. అవి వస్తాయనే నమ్మకం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన సన్నిహితులు కొందరిపై ఇప్పటికే ఇటలీ అధికారులు వారెంట్లు జారీ చేసినట్లు సమాచారం.