*ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలి*
మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరి చేయాలని మునగాల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపులో భాగంగా మునగాల మండల రైతు సంఘం తరఫున ఇంచార్జి తహశీల్దార్ నాగేశ్వరరావుకు సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, ధరణిలో ఉన్న లోపాలను వెంటనే సరి చేయాలని వారు డిమాండ్ చేశారు. ధరణిలో పేరు తప్పులు, భూముల హెచ్చుతగ్గులు కొంత మంది రైతుల పట్టా భూములు నిషేధిత లిస్టులో పడటం.. ఇంకా అనేక రకమైన సమస్యలు ఉన్నాయని, రైతులు గత ఐదు సంవత్సరాల నుండి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నా గాని ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేసి వీటిని తేల్చాలని, చెప్పిన దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఇరవై సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినా నేటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోవడం వలన రైతులు రైతుబంధు రాక అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, మండల రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు చందా చంద్రయ్య దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, జూలకంటి కొండారెడ్డి, బోళ్ళ కృష్ణారెడ్డి, వీరబోయిన వెంకన్న, సుంకర పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.