ధరలు తగ్గడంతో కూరగాయల రైతుల ఆందోళన

జైపూర్‌,మే8(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా టమాటా దరలు బాగా పడిపోయాయి.  కిలో రూపాయి, రెండు రూపాయలకు అమ్మదామన్నా, కొనేవారే లేరని అన్నారు. మరో గత్యంతరం లేక టమోటాలను పశువులకు మేతగా వేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వెల్లుల్లి, ఉల్లి రైతులు కూడా తమ పంటలకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు.టమోటా పంట ఉత్పత్తి అధికం కావడం, పాకిస్థాన్‌కు ఎగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానిక రైతులు చెబుతున్నారు. 2014లో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని ప్రకటించింది. అయితే ఈ మాటచెప్పి నాలుగేళ్లు గడిచినా రైతుల పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు. టమాటా, వెల్లుల్లి, ఉల్లి రైతులు తమ పంటలకు కనీస గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఖోరా బిస్లా ప్రాంతం టమోటా ఉత్పత్తిలో దేశంలో ముందుంది. దేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే టమోటాలు ఎగుమతి అవుతుంటాయి. అయితే ప్రస్తుతం టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.