ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేపట్టాలి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి.
యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వానాకాలం 2022-23 వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకెపి 74 కొనుగోలు కేంద్రాలకు చెందిన కమిటీ సభ్యులు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రేపటి నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న దృష్ట్యా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహించాలని, కొనుగోలు కాగానే ట్యాబ్ ఎంట్రీ నమోదు వెంటనే నిర్వహించాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం వస్తున్న ప్రక్రియను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచాలని తెలిపారు. ధాన్యం తూర్పారబట్టి తాలు లేకుండా, 17 శాతం లోపు తేమ ఉండేలా రైతులకు అవగాహన కలిగించాలని తెలిపారు. రైతుల నుండి సీరియల్ ప్రకారం కొనుగోళ్లు నిర్వహించాలని, బస్తా బరువు మినహాయించి 40 కిలోలు మించకుండా ఉండేలా, ధాన్యం కొనుగోలు కాగానే వెంటనే లిఫ్ట్ చేసేలా చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలలో తూకం, తేమ యంత్రాలను, గన్నీ బ్యాగులు అందుబాటులో వుంచాలని, టెంట్, త్రాగునీటి వసతులు కల్పించాలని తెలిపారు. వర్షాలు ఉన్నందున కొనుగోళ్ల ప్రక్రియలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.శిక్షణా కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి మందడి ఉపేందర్రెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎం.గోపీకృష్ణ, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, డిపిఎం సునీల్ రెడ్డి, అడిషనల్ డి.ఆర్.డి.ఏ. జోజప్ప, ఎపిఎంలు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.