ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్ సవాల్
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి):
తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సమ్మెలో ఎందుకు పాల్గొనలేదని ఆయన నిలదీశారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినంత మాత్రాన ఆయన అనుకూలమని ప్రజలు విశ్వసించరని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టేవారా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, పదవుల కోసం కేసీఆర్ కాని, టీఆర్‌ఎస్ నాయకులు కాని ఎన్నడూ పాకులాడలేదని అన్నారు. నమ్మిన తెలంగాణ సిద్ధాంతం కోసం పదవులను త్యాగం చేసిన చరిత్ర టీఆర్‌ఎస్ నాయకులదని అన్నారు. పదవుల కోసం గడ్డి తినే నైజం చంద్రబాబుది అని ఆయన విమర్శించారు. పదవుల కోసం పిల్ల నిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని హరీష్‌రావు విమర్శించారు. చంద్రబాబు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోసమే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కాని, టీఆర్‌ఎస్ కాని ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడింది టీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. మెడికల్ సీట్లలో విద్యార్థులకు అన్యాయం జరిగితే కోట్లాడింది టీఆర్‌ఎస్ పార్టీయేనని చెప్పారు. సాగర్ నుంచి నీరు ఇవ్వకపోతే పోట్లాడింది కూడా తమ పార్టీయేనన్నారు. నిత్యం ప్రజల కోసం పోరాడింది తామేనని, టీడీపీ నాయకులను అడిగినా చెబుతారని అన్నారు. రైతులకు ఏడు గంటలు కరెంట్ సరఫరా కోసం పోరాడింది కూడా తమ పార్టీయేనన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు వామపక్షాలతో, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల కోసమే టీఆర్‌ఎస్ పనిచేస్తోందని హరీష్‌రావు స్పష్టం చేశారు. చంద్రబాబులా పదవుల కోసం గడ్డి తినే నైజం తమది కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు.