నకిరేకల్ ఆస్పత్రిని విస్తరించాలి
ప్రమాద బాధితులకు ఇదే వరం
నల్గొండ,అక్టోబర్5 (జనంసాక్షి): నిత్యం రోడ్డు ప్రమాద బాధితులు.. మూడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల నుంచి రోగుల తాకిడి ఉన్నా నకిరేకల్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదన్న విమర్శుల ఉన్నాయి. జాతీయ రహదారిపై జిల్లాతోపాటు నిత్యం వేలాదిమంది ప్రయాణికులు వెళుతుంటారు. హైవేపై ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లు అధికం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రమాదాలకు గురైన వారిని మొదటగా నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలకు
తీసుకొస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందిస్తే 30 శాతం మంది ప్రాణాలు కాపాడేందుకు వీలుంటుంది. అయితే ఇక్కడ ట్రామా కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఇకపోతే నకిరేకల్ వైద్యశాలలో ఆరోగ్యశ్రీసేవలు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా నేటికి ఆ సేవలు అందుబాటులోకి రాలేదు. పేరుకే 30 పడకల వైద్యశాల
ఉన్నపటికి మూడు నియోజకవర్గాలకు చెందిన నాలుగైదు మండలాల నుంచి నిత్యం రోగులు వస్తుంటారు.
వైద్యశాలకు 250 నుంచి 300 మందివరకు బయటిరోగులు చికిత్సల కోసం వస్తుంటారు. అత్యవసర వైద్యం కోసం ఒకే రోగులు అధిక సంఖ్యలో వస్తే ఇక్కడ సదుపాయాలు సరిపడా అందడం లేదు. అయితే ఈ వైద్యశాలను విస్తరించే అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని ప్రధాన వైద్యాధికారి అన్నారు.