నగరం నిద్రపోతున్న వేళ

2

– కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

– అసౌకర్యాలపై ఆగ్రహం

హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి): తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్‌ నగరంలో అర్దరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారులకు ముచ్చెమటుల పోయించారు.  ఆయన రాత్రి పదకుండు గంటల నుంచి అర్దరాత్రి 2.30 గంటల వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి రోడ్లు, తదితర సమస్యలపై అధికారులతో సవిూక్షించారు. వంద రోజుల ప్రణాళిక ప్రకటించాక బేరీజు వేసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఆయన ఆకస్మిక తనిఖీలుచేపట్టడం విశేషం. కూకట్‌ పల్లి, కెపిహెచ్‌ బి, ఎస్సార్‌ నగర్‌, అవిూర్‌ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో పర్యటన చేశారు. ఆయా చోట్ల జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు,వాటి పురోగతిపై అధికారులతో చర్చించారు. రోడ్లతో పాటు మురికి నీటి పారుదల సమస్యలు, బస్‌ స్టాప్‌లలో ప్రయాణికుల సదుపాయాలు మొదలైనవాటి గురించి కూడా పరిశీలన చేశారు. కెపి హెచ్‌ బి బస్టాప్‌ వద్ద నీరు నిలబడడంపై జాతీయ రహదారుల అధికారులపై ఆయన సీరియస్‌ అయ్యారు. బస్టాపుల్లో ప్రయాణికులు కూర్చోవడానికి వీలులేకుండా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ బస్టాప్‌ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంపై మంత్రి జాతీయ రహదారుల అథారిటీ సంస్థ, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులపై తీవ్రంగా స్పందించారు. పనుల్లో వేగం పెంచి వారం రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. మరికొన్నిసార్లు ఆకస్మిక పర్యటనలు చేస్తానని మంత్రి తెలిపారు. పంజగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగి రమ్య అనే బాలిక మరణానికి కారణమైన రోడ్డు పరిస్థితిని కూడా కెటిఆర్‌ పరిశీలించారు. కూకట్‌పల్లి, ఉషాముళ్లపూడి రోడ్డు ప్రాంతం, పంజాగుట్టలో చిన్నారి రమ్య మృతికి కారణమైన ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు. రోడ్లు, మురుగునీటి పారుదల, బస్టాండ్లను తనిఖీ చేశారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన మంత్రి.. సత్వరమే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. మరికొన్ని రోజులపాటు ఇలాగే రాత్రి సమయంలో ఆకస్మిక పర్యటనలు చేస్తానని మంత్రి తెలిపారు. అధికారులందరూ నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పంజాగుట్టలో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రోడ్డు ఇరుకుగా ఉండటాన్ని గుర్తించిన మంత్రి … సరైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.