నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు
– బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు
పాటియాలా, (జనంసాక్షి) :
పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ రజోనా తనను ఉరి తీయాలని కోరాడు. పాటియాల జైళ్లో ఉన్న ఆయన ఈమేరకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశాడు. తనకోసం క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టవద్దని తన సోదరిని, కుటుంబ సభ్యులను అభ్యర్థించాడు. తనకు ఉరిశిక్ష అమలు చేయాలని రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.తనకు క్షమాభిక్ష పెట్టమని కాంగ్రెస్‌ పార్టీ ఎదుట మోకరిల్లడం ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నాడు. ఇంతకుముందు, ఇకముందు కూడా తన వైఖరిలో మార్పు ఉండబోదన్నారు. బియాంత్‌సింగ్‌ను 1995 ఆగస్టు 31న రాష్ట్ర సెక్రటేరియట్‌ వద్ద మానవబాంబు పేల్చి హత్య చేశారు. ఈ కేసులో రజోనాతో పాటు 16 మంది నిందితులుగా ఉన్నారు. ఆయన 2006లో కోర్టు మరణ శిక్ష విధించింది. ఆయనకు 2012 మార్చి 31న మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఆయన వేసిన రివ్యూ పిటిషన్‌తో శిక్ష అమలును నిలిపివేశారు. అప్పటి నుంచి రజోనా క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఇటీవల పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా పేర్కొంటూ అఫ్జల్‌గురును ఉరితీయడంతో తర్వాతి ఉరి రజోనాదే అవుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఆయన రాసిన బహిరంగ లేఖలో తనకు క్షమాభిక్ష అవసరం లేదన్నట్టుగా పేర్కొనడం సంచలనం సృష్టించింది .