నబమ్‌టుకి బలం నిరూపించుకో…

4

– సుప్రీం అలా చెప్పలేదు:టుకి

గువహటి,జులై 14(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నబమ్‌ టుకి శనివారం బలనిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ కోరినట్లు సమాచారం. రాజకీయ సంక్షోభం నెలకొన్న అరుణాచల్‌లో సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ పాలన పునరుద్ధరించాలని ఆదేశించడంతో నబమ్‌ టుకి మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నబమ్‌ టుకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. డిసెంబరు 15 నాటికి 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ శాసనసభలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులున్నారు. భాజపాకు 11 మంది, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. 47 మంది కాంగ్రెస్‌ సభ్యుల్లో 21 మంది తిరుగుబాటు చేయగా.. 14 మందిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న అరుణాచల్‌లో కలిఖో పుల్‌ ఆధ్వర్యంలోని 21 మంది సీఎంగా ఉన్న నబమ్‌ టుకిపై తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. తర్వాత రాష్ట్రపతి పాలన విధించి.. ఎత్తేశారు. కలిఖో పుల్‌ ముఖ్యమంత్రిగా తిరుగుబాటు నేతలు, భాజపా ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంలో గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ చర్యలు న్యాయ సమ్మతం కాదని  కోర్టు తేల్చిచెప్పింది. 2015 డిసెంబరు ముందు నాటి పరిస్థితి పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో తిరిగి టుకి సీఎం అయ్యారు.