నరేగా నిధులతో డ్రైనేజీ పనులు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగాలి
ప్రకాశంలో దళిత సదస్సు, గుంటూరులో మైనార్టీ సదస్సు
రాబోయే ఆరు నెల్లలో 75 కార్యక్రమాలు
పార్టీ సమన్వయ సమితి భేటీలో బాబు వెల్లడి
అమరావతి,జూన్12(జనం సాక్షి ): నరేగా నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు పలు పనులు బాగా చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల సమయం చాలా జాగ్రత్తగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికలలో టీడీపీ గెలవడం చాలా అవసరమని ఆయన అన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసేతప్పుడు పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశంలో దళిత సదస్సు, గుంటూరులో మైనార్టీ సదస్సు నిర్వహించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి ఆనందబాబు నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన నేతలంతా కూర్చొని దళిత సదస్సుపై చర్చించాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో బీసీల అంశంపై చర్చించాలని, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవా మిత్రలకు పార్లమెంటు వారీగా ఎన్నికల వరకు శిక్షణ శిబిరాలు కొనసాగాలన్నారు. అన్ని కోణాల నుంచి తాను ఫీడ్ తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. సీఎంకు ఏవిూ తెలియదులే అనే భావన వదిలేయాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడబోనని చంద్రబాబు హెచ్చిరించారు. ప్రభుత్వం చేసిన పనులపై ప్రచారం విస్తృతంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రింట్, ఎలక్టాన్రిక్, సోషల్, మౌత్ ప్రచారంతో ముందుకుసాగాలన్నారు. ఎలా కష్టపడ్డామన్నది కాదని, గెలుపు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలంటే అన్నింటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్ విూడియాను నేతలంతా విస్తృతంగా వాడుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సహజ వనరులను దోచుకుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాబోయే 6నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని, సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానన్నారు. ప్రతి 45 రోజులకు నాయకులపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. కార్యకర్తలతో నేతలంతా సత్సంబంధాలు కలిగి ఉండాలని నేతలకు సూచించారు. విభజన చట్టంలోని హావిూలు అమలు కాకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని బాబు సూచించారు. కడపలో స్టీల్‌ఎ/-లాంట్, విశాఖలో రైల్వేజోన్, గోదావరి జిల్లాల్లో పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు అంశాలపై దీక్షలు నిర్వహించాలన్నారు. ఎంపీలు 15రోజులకు ఒక కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిర్వహించాలన్నారు. బహిరంగ సభలతో పాటు, ఢిల్లీలో ఆందోళనలు చేయాలని చంద్రబాబు అన్నారు. కొందరు పార్టీ నేతలు ఇప్పటివరకూ సరిగా పని చేయకపోయినా మారుతారులే అన్న భావనతో చర్యలు తీసుకోలేదని సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తానేవిూ పట్టించుకోవటం లేదనుకుని ఏదైనా చేయొచ్చు అనే భావనలో కొందరు నేతలున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన దగ్గర ఉన్నాయని.. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున ఇకపై ఎవరి నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోనని తేల్చిచెప్పారు. ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.
వాజ్‌పేయ్ ఆరోగ్యంపై ఆరా
దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు దిల్లీలోని అధికారులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాజ్‌పేయీ రేపటికల్లా డిశ్చార్జి అవుతారని కేంద్రమంత్రి విజయ్ గోయల్ విశ్వాసం వ్యక్తంచేశారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారని చెప్పారు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఉందని, వైద్యులు చికిత్స అందించారని తెలిపారు.