నల్లమలకు స్పీకర్‌ బృందం

చెంచులను మనుషులుగా గుర్తించిన సర్కార్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి8 (జనంసాక్షి) :
నల్లమల పర్యటనకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం బయల్దేరింది. నల్లమల అడవుల్లో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, చెంచుల జీవ వైవిధ్యాన్ని ఎమ్మెల్యేల బృందం అధ్యయనం చేయ నుంది. 16 మంది ఎమ్మెల్యేల బృందంతో కూడిన వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ మహబూబ్‌నగర్‌ జిల్లాకు బయల్దేరింది. పర్యటనలో భాగంగా నల్లమల పరిధి విస్తరించి ఉన్న మహబూ బ్‌నగర్‌ జిల్లాలోని మన్ననూరు, అప్పాపూర్‌లలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చెంచుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. మన్నననూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల అభివృద్ధి, తాగునీరు, గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ, వైద్యం తదితర అం శాలపై దృష్టి సారించనున్నారు. అలాగే, పర్యా వరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు. రెండ్రోజుల పాటు నల్లమలలోనే బస చేయనున్న కమిటీ సభ్యులు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొని హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం సాయంత్రం వరకు స్పీకర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మహబూబ్‌నగర్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు కనీస హక్కులు, ఓటు హక్కు కూడా లేని చెంచులను ప్రభుత్వాలు మనుషులుగా కూడా గుర్తించలేదు. ఇప్పటికైనా వారిని స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం పక్షాన ఓ బృందం వెళ్లడం గమనార్హం.
గతంలో అరకులో పర్యటించిన బృందం అక్కడ గిరిజనుల అభివృద్ధికి అనేక సూచనలు చేసింది. అలాగే నల్లగొండ ఫ్లోరైడ్‌పై కూడా అధ్యయనం చేసింది. ఇప్పుడు చెంచుల మనుగడపై అధ్యయనం చేయనుంది.అంతరించిపోతున్న గిరిజన జాతిగా గుర్తించిన చెంచులకు అక్రమ మద్యం ప్రాణాంతకంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమ సారా చెంచుల ప్రాణాల్ని కాటేస్తోంది. చెంచుల జనాభా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నా.. మరోవైపు వారు పెద్ద సంఖ్యంలో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించిన ఏడు జిల్లాల్లో ఉన్న 42,032 మంది చెంచుల అభివృద్ధి, సంక్షేమం కాగితాలకే పరిమితమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా చెంచుల అభివృద్ధి తిరోగమనం తప్ప ముందుకు వెళ్లడం లేదు. చెంచుల స్థితిగతుల్ని స్వయంగా గుర్తించేందుకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనసభ పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యులు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లమల అటవీప్రాంతంలో పర్యటించనున్నారు. నల్లమల పులుల సంరక్షణ కేంద్రం, అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల స్థితిని వారు తెలుసుకోనున్నారు. చెంచుల కోసం ప్రత్యేకంగా ఉన్న గిరిజన సంక్షేమ విభాగం పనితీరును సమీక్షిస్తారు. మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల్లోని చెంచుగూడాలను సందర్శించనున్నారు. ఇప్పటికీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 చెంచుగూడాలు, కర్నూలు జిల్లాలో ఐదు గూడాలకు విద్యుత్‌ సౌకర్యం లేక చీకట్లోనే మగ్గుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చెంచుగూడాల్లో మంజూరైన 21 బాలబడులు ఇంతవరకూ ప్రారంభం కాలేదు. చెంచుల్లో 90 శాతం కుటుంబాలకు ఇళ్లను నిర్మించినట్లు అధికారిక రికార్డుల్లో ఉన్నా అత్యధికం చెంచులు గుడిసెలకే పరిమితమయ్యారు. వారి చదువులు అర్దాంతరంగా ఆగిపోతున్నాయి. చాలవరకూ ఐదో తరగతికి పరిమితమవుతున్నారు. పురుషణల్లో అక్షరాస్యత 41.2 శాతం, మహిళల అక్షరాస్యత 23.4 శాతంగా అధికారులు పేర్కొన్నారు.