నవరత్నాల ద్వారా..  పేదల జీవితాల్లో వెలుగులు 

– గత ఐదేళ్లలో దుర్మార్గపు పాలనను చూశాం
– మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, అక్టోబర్‌29 (జనం సాక్షి ) : నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి మత్తం శెట్టి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు అన్నారు. విశాఖ తగరపువలస జూట్‌ మిల్స్‌ గ్రౌండ్‌లో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి  మంత్రి, ఎంపీతో పాటు విఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్‌ జి. సృజన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీలు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో దుర్గార్మగపు పాలనను చూశామని,  వైసీపీ సానభూతిపరులకు సంక్షేమ
పథకాలు అందకుండా గత ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలకతీతంగా పథకాలను అందిస్తున్నారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విశాఖ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని తెలిపారు.  అనంతరం విశాఖపట్నంలోని మధురవాడలో ఆంధప్రదేశ్‌ గిరిజన గురుకుల ఇంగ్లీషు విూడియం స్కూల్‌ లో రాష్ట్ర స్దాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను లాంచనంగా ప్రారంభించారు . కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.