నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో శనివారం నుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగుల సంఘం నాయకులు ప్రకటించారు. జవహర్‌ నవోదయ విద్యాసమితి 1986లో ఏర్పడగా, 1989 నుంచి 2004 మధ్య విధుల్లో చేరిన ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించలేదు. అలాగే ఉద్యోగులకు ఆదివారాలు సహా ఇతర ప్రభుత్వ సెలవులన్నీ పనిదినాలే. ఒక్కో విద్యార్థి 15 మంది విద్యార్థులకు గైడ్‌గా ఉంటూ వారి ఆలన పాలన చూసుకునే వారు. యేడాది పొడవునా విధులు నిర్వర్తించాల్సి రావడంతో కుటుంబాలకు దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోయారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు విధులు నిర్వహించాల్సి రావడం, కనీసం అలవెన్స్‌లు కూడ ఇవ్వకపోవడంపై సిబ్బంది మండిపడ్డారు. పెన్షన్‌తో పాటు సెలవులు, నిర్దిష్టమైన పనివేళలు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల ఆరో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యాలయాల్లో బోధనతో పాటు, అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శశిథరూర్‌తో ఉద్యోగ సంఘాల నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెన్షన్‌తో పాటు సెలవులు, పనివేళలు, అలవెన్స్‌లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఉద్యోగుల సంఘం నాయకులు మీడియాకు తెలిపారు.