నవ దుర్గా మందిరంలో ముగిసిన శత చండీయాగం
ఆదిలాబాద్ సాంస్కృతికం: గత మూడు రోజులుగా జిల్లాలో మావల గ్రామ పంచాయతీ పరిధి దుర్గానగర్ కాలనీలోని నవ దుర్గా మందిరంలో శత చండీయాగం సోమవారంతో ముగిసింది. యజ్ఞాచార్యులు బ్రహ్మశ్రీ రామచంద్ర శర్మ శాస్త్రీయ పద్ధతిలో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. హోమగుండంలో వస్త్రం, పసుపు, కుంకుమ, ద్రవ్య పదార్థాలు అగ్నికి అర్పించారు. వేద పండితులు దేవి మంత్రాలను పఠించారు. భక్తులు చతుర్వేద పారాయణం, శ్రీ చక్రార్చన, చండీ , రుద్ర, శాంతి హోమం గావించారు. అనంతరం యజ్ఞ వ్యవస్థాపకులు కిషన్ మహారాజ్ మాట్లాడుతూ కర్మను భగవానునికి అర్పించటంతో విశ్వశాంతితో పాటు మానవుని మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వేదపండితులు శివానంద శర్మ, కృష్ణానందశర్మ, సాయిదీక్షిత శర్మ, ప్రవీణ్ ఆచార్యుల బృందం పాల్గొన్నారు.