నాగార్జున అగ్రికెమ్ శాశ్వతంగా మూసివేయాల్సిందే
అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసనంద స్వామి
శ్రీకాకుళం, జూలై 28 : అక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ పరిశ్రమ శాశ్వతంగా మూత వేయాల్సిందేనని అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసనంద స్వామి పేర్కొన్నారు. పొందూరు మండలంలోని నందివాడ నరసాపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రజా చైతన్యయాత్రలో ఆయన మాట్లాడారు. జూన్ 30న జరిగిన సంఘటన నేటికీ కళ్ల ముందే మెదులుతునే ఉందని అన్నారు. ఇలాంటి సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఎలా బతకగలరని ప్రశ్నించారు. పరిశ్రమను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆయన శనివారం నాడు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే భూగర్బ జలాలు కలుషితమయ్యాయని, ప్రజలంతా రోగల పాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో నిత్యం చెలగటమాడే పరిశ్రమ ఉండకుండా చేయాలంటే ప్రతి ఇంటి నుంచి ఉద్యమం ప్రారంభమవాలని ఆయన కోరారు. ఆయన వెంట లక్ష్మణరావు, రామినాయుడు తదితరులు ఉన్నారు.