నాగా, మేఘా, త్రిపురాలో అధికార పక్షాలే విజేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల్లో అధికార పక్షాలే విజయభేరి మోగించాయి. గురు వారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపుర రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలకు గాను 49 స్థానాలు సీపీఎం గెలుచుకోగా మిత్ర పక్షం ఒక స్థానం గెలుచుకుంది. కాంగ్రెస్‌ కేవలం పది స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉండగా 1998 నుంచి ఆ రాష్ట్రాన్ని
పాలిస్తున్న మానిక్‌ సర్కార్‌ మరో మారు సీఎం అయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయి.
మేఘాలయలో..
రాష్ట్రంలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 29 స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ (31 సీట్లు)కి కేవలం రెండు సీట్ల దూరంలో ఉంది. ఇతరులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించారు.
నాగాలాండ్‌లో..
నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్‌పీఎఫ్‌ కూటమి 37 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 2008లో సాధించిన మెజార్టీకంటే అదనంగా రెండు ఎక్కువ సీట్లు సాధించింది. 57 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అటు ఎన్‌సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు.