నాపై కుట్ర చేశారు!

– అవినీతిని బయట పెడుతున్నందుకే టార్గెట్‌
– తన కుల ధృవీకరణ పత్రాన్ని జేసీకి అందించా
– తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
గుంటూరు, నవంబర్‌26(జనం సాక్షి) : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు పెడుతున్నందుకే తనను టార్గెట్‌ చేశారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్యే కులంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో ఆమె.. మంగళవారం గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ముందు విచారణకు హాజరయ్యారు. జేసీ ముందు తన వాదనల్ని వినిపించి.. తన కులానికి సంబంధించిన సర్టిఫికేట్లను అధికారులకు ఎమ్మెల్యే శ్రీదేవి అందజేశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
తనపై దుష్పచ్రారం చేస్తున్నారని.. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు. కులానికి సంబంధించిన అన్ని పత్రాలను జాయింట్‌ కలెక్టర్‌కు అందజేశానని  తనకు, తన కుటుంబ సభ్యులకు సర్టిఫికేట్లు ఉన్నాయన్నారు. తాను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున డాక్టర్‌ శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె కుల ధ్రువీకరణపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్‌ రైట్స్‌ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. తాను క్రిస్టియన్‌.. తన భర్త కాపు అంటూ ఆమె వ్యాఖ్యానించారట. దీంతో ఆమె కులంపై కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. తర్వాత లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై
ఫిర్యాదు అందడంతో.. ఈ వ్యవవహారంపై విచారణ చేయాలని.. వాస్తవాలు విచారించాలని ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ సీఎస్‌ను విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ విచారణకు రావాలని ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. దీంతో శ్రీదేవి జేసీ ముందు విచారణకు హాజరయ్యారు.. సర్టిఫికేట్లను సమర్పించారు.