నామమాత్రంగా భూసార పరీక్షా కేంద్రాలు

రైతులకు సమయానికి అక్కకు రాని పరీక్షలు
సిబ్బంది కొరతే కారణమంటున్న రైతులు
విశాఖపట్టణం,నవంబర్‌8  (జనం సాక్షి) : సిబ్బంది కొరతతో భూసార పరీక్షా కేంద్రాలు నిస్తేజంగా మారాయి. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా జనవరి నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే భూసార పరీక్షలు చేస్తుంటారు. మిగిలిన సమయంలో భూసార పరీక్షలు పెద్దగా జరగవు. అంతేకాకుండా గత ఏడాది నుంచి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఆ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్లలోని భూముల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నామమాత్రంగా ఉన్న సిబ్బంది పైలట్‌ గ్రామాల్లో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలు వుండగా, ఒక్క అనకాపల్లిలో మాత్రమే భూసార పరీక్షలు జరుగుతున్నాయి. మిగిలిన మూడుచోట్ల ఒక ఏవో, ఒక అటెండరు మాత్రమే వున్నారు. గతంలో పనిచేసిన ఎంపీఈవోల డిప్యూటేషన్‌ను ప్రభుత్వం జూలై నుంచి రద్దుచేయడంతో పొలాల్లో మట్టిని సేకరించి, ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు వివరాలు అందజేయడానికి ఎవరూ లేకుండా పోయారు. ఆయా కేంద్రాలకు రైతులకు తీసుకువచ్చిన మట్టి నమూనాలను అనకాపల్లి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ఉన్న భూసార పరీక్షా కేంద్రాల పరిస్థితి పరిశీలించగా… మొక్కుబడిగా పనిచేస్తున్న విషయం తెలిసింది. జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు, విశాఖపట్నంలో మాత్రమే భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సంచార భూసార పరీక్షా కేంద్రం ఉంది. అయితే ఈ కేంద్రం జిల్లాలో సంచరించేందుకు వాహనం లేకపోవడంతో అక్కడ ఉండే సిబ్బందికి జిల్లాలో కొన్ని మండలాలకు కేటాయించారు. నర్సీపట్నంలో భూసార పరీక్షా కేంద్రాన్ని సుమారు పదేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత తొలగించారు. 2014 నవంబరులో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో వ్యవసాయ అధికారిణితోపాటు ఒక అటెండర్‌ మినహా మరెవ్వరూ లేదు. కేంద్రంలో మట్టి నమూనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రి ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. దీంతో రైతులు ఎవరైనా మట్టి నమూనాలను తీసుకువస్తే వాటిని అనకాపల్లి భూసార పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నారు. పాడేరు కేంద్రంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల భూసార పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈలోగా రైతులు పొలాల్లో పంటలు వేయడం, అవి చేతికి రావడం కూడా పూర్తవుతున్నది.