నామినేషన్ వేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
సూర్యాపేట,సెప్టెంబర్30 జనంసాక్షి : హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో అరాచకం ప్రారంభమైందన్నారు. స్లాట్ ఉన్నా ఇతర అభ్యర్థుల నామినేషన్లు తీసుకున్నారని ఆమె విమర్శించారు. ఈ ఎన్నిక ప్రజలకు, టీఆర్‌ఎస్ దౌర్జన్యాలకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆమె అభివర్ణించారు. మహిళా అభ్యర్థిని మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని పద్మావతి అన్నారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థిగా రామారావు కూడా సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను టీఆర్‌ఎస్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చిన సైదిరెడ్డి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. హుజూర్‌నగర్‌లో పరిశ్రమల నుంచి వచ్చే సెస్సు.. రూ.300 కోట్లను మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేటకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. తాను గెలిస్తే హుజూర్‌నగర్‌లో మెడికల్ కాలేజీ కోసం కృషి చేస్తానని రామారావు అన్నారు.