నాలుగు నెలల్లో అందుబాటులోకి సోలార్‌ పవర్‌

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): నందిపేట్‌ మండలం వన్నెల్‌(కె) గ్రామంలో భారీ సోలార్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ  ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తి చేసిన కరెంటును నేరుగా నందిపేట్‌లోని సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులు వారి అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు సరఫరా చేస్తారు.  ప్రజలకు కరెంటు కష్టాలను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  కృషి చేస్తోంది.ఇందులో భాగంగా నందిపేట్‌ మండలం వన్నెల్‌(కె) గ్రామంలో భారీ సోలార్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాలుగు నెలల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. సోలార్‌ విద్యుత్తు అందుబాటులోకి వస్తుండటంతో మండల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సోలార్‌ విద్యుత్తు అందుబాటులోకి వస్తే లో ఓల్టేజీ, ఇతర కరెంటు సమస్యలు దూరం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉజ్వల తేజస్‌ కంపెనీ సుమారు వందకోట్ల వ్యయంతో సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంది. సుమారు 85 ఎకరాల్లో ప్రాజెక్టును నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఇది వరకే కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి, విక్రయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కూడా కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రోజూ వందల మంది కూలీలతో వేగంగా పనులు చేయిస్తున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను కూడా ప్లాంటు వేయనున్న ప్రాంతానికి తరలిస్తున్నారు.  ప్లాంటులో ఉత్పత్తి అయ్యే 20మెగావాట్ల విద్యుత్తుతో వ్యవసాయ బోర్లకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో సోలార్‌

ప్రాజెక్టు నిర్మాణంలో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ప్రజలకు సోలార్‌ విద్యుత్తు ప్రాధాన్యత తెలుస్తుంది. పర్యావరణంపై అవగాహన కలుగుతుంది. తమ అవసరాలకు కూడా ఇళ్లలో, వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్‌ విద్యుత్తు వినియోగించుకోవాలనే ఆలోచన వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కొంత మేర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.