నాలుగేళ్లుగా ఎపికి అన్యాయం చేస్తోన్న బిజెపి
నెత్తీనోరూ మొత్తుకున్నా వినిపించుకోలేదు
సిఎం రమేశ్ దీక్షకు మద్దతు పలికిన నటుడు శివాజీ
రమణదీక్షితులది రాజకీయ పోరాటమని విమర్శ
కడప,జూన్26(జనం సాక్షి): విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా చాలా అవసరమని సినీనటుడు శివాజీ అన్నారు. నాలుగేళ్లుగా ఈ విషయంలో బిజెపి చేస్తున్న మోసాలను చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మరోమారు బిజెపి ఉచ్చులో పడకుండా పోరాటాలకు సిద్దపడాలని ఆయన పిలుపునిచ్చారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను మంగళవారం ఆయన పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి భాజపా అన్యాయం చేస్తోందని నాలుగేళ్ల నుంచీ తాము మొత్తుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఆదుకోవాల్సింది పోయి భాజపా రాజకీయాలు చేస్తోందన్నారు. కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం కేటాయించని ఆ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎపీకి రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ప్రస్తుతం ఏపీకి రూ.82వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని శివాజీ తెలిపారు. అందులో విభజన వల్ల వచ్చిన అప్పే రూ.52వేల కోట్లని వెల్లడించారు. తిరుమల ఆలయాన్ని రాష్ట్రం నుంచి వేరు చేసేలా రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కిపడేస్తారని హెచ్చరించారు. . ఎన్నో సంవత్సరాల పాటు శ్రీవారికి సేవలో తరించిన రమణ దీక్షితులు పదవి కోల్పోగానే తితిదేపై విమర్శలు చేయడం సరికాదని శివాజీ అన్నారు. ఆయన్ని ఎవరూ తొలగించలేదని.. ఆయన సేవలు ఇక చాలని ఆ వెంకటేశ్వరస్వామే విశ్రాంతి కల్పించారని అన్నారు. రమణ దీక్షితులు తెలివైన వారే అయితే పదవి నుంచి వైదొలగిన తర్వాత విమర్శలు చేయకుండా.. శ్రీవారి మహిమల గురించి భక్తకోటికి వివరించే కార్యం చేపట్టినట్లయితే భక్తులు ఆయన్ని దేవుడిగా కొలిచేవారని శివాజీ అన్నారు.కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంతో అంటకాగడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడానికి రాలేదని… ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడిన నేతలకు సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఓట్లేసి అధికారం కట్టబెట్టిన పార్టీకి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వాలని.. వారు తప్పుచేస్తే తర్వాతి ఎన్నికల్లో ప్రజలే గ్దదె దించేస్తారని అన్నారు