నాలుగేళ్ల పాలనలో.. అన్ని వర్గాలకు మేలుచేశాం
– తెరాస పాక్షిక మేనిఫెస్టోతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది
– కేసీఆర్ దెబ్బకు మహాకూటమి అడ్రస్సు గల్లంతు ఖాయం
– పరకాల ప్రజలు చిల్లరగాళ్లన్నవాళ్లే .. ఇక్కడ పోటీకి సిద్ధమవుతున్నారు
– రౌడీ రాజకీయాలు చేస్తే తరిమికొట్టండి
– పరకాల తాజామాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్, అక్టోబర్23(జనంసాక్షి) : నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని పరకాల తెరాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం రాయపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు రెండు వందల మందికిపైగా తెరాసలో చేరారు. వారికి పరకాల తాజామాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి రాజకీయాలు చూడలేక, ఆ పార్టీ విధానాలు నచ్చకనే నేడు తెరాసలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ పాక్షిక మానిఫెస్టో విడుదల చేసిన తర్వాత తెరాసకు రాష్ట్రంలో మరింత ఆదరణ పెరిగిందన్నారు. కేసీఆర్ దెబ్బకు మహాకూటమి అడ్రస్ గల్లంతు ఖాయమన్నారు. తెలంగాణలో తెరాసను ఎదుర్కొనే సత్తా ఏ కూటమికి లేదన్నారు. కేసీఆర్ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచానన్నారు. ఆ అభివృద్ధిని కండ్లుఉండి చూడలేని గుడ్డివారు ఈ ప్రతిపక్ష నాయకులు అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో ఆదర్శంగా నిలిపిన కేసీఆర్, రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెరాసనే అన్నారు. పోరాటాల పురిటిగడ్డలో తెరాస జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పరకాల ప్రజలను చిల్లరగాళ్ళు అన్న వాళ్లే మళ్ళీ పరకాలకు వస్తున్నారన్నారు. వారికి బుద్ది చెప్పేందుకు పరకాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెరాసకు వస్తున్న ఆదరణచూసి కాంగ్రెస్ నాయకుల నరాలు తెగుతున్నాయన్నారు. గుండాగిరి రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు తరిమికొట్టే రోజులివన్నారు. తెరాసలో చేరిన వారిలో మత్య్సపారిశ్రామిక సంఘం అధ్యక్షులు అల్లే సంతోషకుమార్, రజకసంఘం అధ్యక్షులు చిగురుమామిడి రవికుమార్, ఎస్‌ఆర్‌ఎస్పీ మాజీ డైరెకట్ రాచమల్ల నర్సయ్య, ఎఫ్ సీఎస్ సొసైటీ డైరెక్టర్లు చిదిరిక కోటి, కుమారస్వామి, మాచబోయిన సారయ్య, మాజీ అధ్యక్షులు అల్లం సారయ్య, వీరితోపాటు యూత్ నాయకులు, తదితరులు చేరారు.