నా భర్తను కాపాడండి
– మెమన్ భార్య వేడుకోలు
ముంబై 26 జులై 2015 (జనంసాక్షి):
ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలి ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్ పట్ల దయ చూపాలని అతని భార్య రహీన్ మెమన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కేసులో యాకుబ్ మెమన్ తనకు తానుగా లొంగిపోయిన కారణంగా ఆయనకు ఉరిశిక్షను అమలు చేయకుండా, ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని ఆమె కోరారు.
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను అమలు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రహీనా మెమన్ స్పందిస్తూ… తన భర్తపై దయ చూపాలని ప్రాధేయపడుతోంది. యాకుబ్ అమాయకుడని ఆమె మరోసారి చెప్పారు. తన కుమార్తె జుబేదా ఒక్క రోజు కూడా తండ్రి యాకుబ్‌తో సమయం గడపలేకపోయిందని రహీన్ మెమన్ చెప్పారు.
ఆ రోజు కోసం ఆమె ఎదురుచూస్తోందన్నారు. తాము పేలుళ్ల తర్వాత దేశం వదిలి పారిపోయామనడం సరికాదని, పేలుళ్లకు ముందే దుబాయ్‌లో ఈద్ జరుపుకోవడానికి వెళ్లామని గుర్తు చేశారు. కాగా, 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. ఈ కేసులో న్యాయస్థానం యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో యాకూబ్ మెమన్ తన సొంతకార్లను సమకూర్చినట్టు అభియోగం రుజువైంది.