నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ -సీ47

– 26.50 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి 14ఉపగ్రహాలు
– ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రముఖులు
నెల్లూరు, నవంబర్‌27 (జనంసాక్షి)  : పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని బుధవారం ఉదయం 9.28గంటలకు చేపట్టారు. అనంతరం 26.50నిమిషాల వ్యవధిలో 14ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ పక్రియ 26 గంటలపాటు సాగింది. లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్వీ 166 సెకెన్లలో తొలి దశ, 266 సెకెన్లలో రెండో దశ, ఎనిమిది నిమిషాల్లో మూడో దశను దాటుకుని చివరిదైన నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేసింది. నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్‌ చేరిన తర్వాత ఉపగ్రహాలు రాకెట్‌ నుంచి విడిపోయి నిర్దేశిత కక్ష్యలో చేరాయి. తర్వాత లాంచింగ్‌ కేంద్రం నుంచి బయలుదేరిన 26.51నిమిషాల్లో కార్టోశాట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత కార్టోశాట్‌-3 నుంచి అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రానికి సంకేతాలు అందుతాయి. మొత్తం 14ఉపగ్రహాలను నింగిలోకి పంపగా వీటిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-3, అమెరికాకు చెందిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలు ఉన్నాయి. కార్టోశాట్‌ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోవిూటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచారు. ఈ ఉపగ్రహ ప్రయోగంతో సరిహద్దుల్లో భద్రత మరింత పటిష్టమవుతుంది. పాక్‌ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3.. 25 సెం.విూ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ.. ఈ అద్భుత ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. మార్చి వరకు మాకు 13 మిషన్లు ఉన్నాయని, మాకు ఇప్పుడు చేతినిండా పని ఉందని, సందర్భానికి తగినట్టుగా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇస్రో సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రయోగం విజయవంతం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.  శాస్త్రవేత్తల కృషి, మేథోసంపత్తికి ఈ ప్రయోగం నిదర్శనం అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. మరోసారి జాతి గర్వించే కార్యాన్ని ఇస్రో విజవంతంగా నిర్వహించిదని చెప్పారు. ఎస్వీఎల్వీ-సీ47 కార్టోసాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన పన్నెండు నానో సాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. కార్టోసాట్‌-3 హై ఎండ్‌ రెజల్యషన్‌ కలిగి ఉందని తెలిపారు. ఇది భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనుందని ప్రధాని చెప్పారు.