నిండుకుండలా మూసీ ప్రాజెక్ట్
ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నల్లగొండ,జూలై13(జనంసాక్షి : ): ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేసారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 638.30 అడుగులకు డ్యామ్ చేరుకున్నది. 3800 క్యూసెక్కుల నీరు ఇన్ ప్లో గా వస్తుండగా..3200 క్యూసెక్కుల నీటిని గేట్స్ ద్వారా దిగువకు వదులు తున్నారు. ఇక మూసీ గేట్లు తెరుచుకున్నాయాన్న సమాచారంతో పర్యాటకులు తరలి వచ్చి మూసి పరవళ్లును చూసి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.జిల్లాలో వరుసగా కురు స్తున్న వర్షాలకు పలు మండలాల్లో చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో పలు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పెసర, శెనగ, పత్తి చేలు నీట మునిగాయి. జిల్లాలో ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని పలు రహదారుల్లో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. సూర్యాపేటలోని సద్దుల చెరువు అలుగు పోస్తోంది. మోతె మండలం లోని పెద్ద చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, నామవరం పెద్ద చెరువు, కూడలి చెక్ డ్యామ్, రావిపహాడ్‌లోని పెద్ద చెరువు అలుగు పోస్తోంది. నర్సింహాపురం, తుమ్మగూడెం బ్రిడ్జిల వద్ద వరద పెరిగి వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. సిరికొండ గుట్ట విూద నుంచి జాలు వరద వస్తోంది. గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో సగటు వర్షపాతం 15.5మి.విూ నమోదైంది. అత్యధికంగా నడిగూడెంలో 28.6మి.విూ నమోదుకాగా అత్యల్పంగా తుంగతుర్తిలో 5.2మి.విూ నమోదైంది. మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన మూసీ ఆధునికీకరణ పనులు ఇప్పటివరకూ పూర్తి కానందున ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న మూసీ ప్రాజెక్టు, పిల్లలమర్రి, ఉండ్రుకొండ దేవాలయాలను ఈకో టూరిజంగా అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.