నిజాంసాగర్ నీటి విడుదలతో రైతుల ఆనందం
కామారెడ్డి,సెప్టెంబర్17(జనంసాక్షి): నింజాసాగర్ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో, పాలు పోసుకునే దశలో ఉండటంతో నీటి అవసరం ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిజాంసాగర్ కాలువల ద్వారా కొంత నీటిని అందిస్తే పంటలు బయట పడతాయని రైతులు భావించారు. ప్రస్తుతం వేయి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తాజా వివరాల మేరకు నిజాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయినా, రైతుల ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని కర్షకులకు కొండంత అండగా నిలుస్తోంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండేందుకు నీటిని అందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతోంది. మొదటి విడతగా పది రోజులు నీటి సరఫరా జరుగుతోంది. వారం రోజులు పాటు నీటి విడుదలను నిలిపి వేసిన తర్వాత మరో తడి కింద అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు నీళ్లను అందించనున్నారు. చివరి ఎకరం వరకూ నీటిని అందివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో స్వల్పంగా ఉన్న జల వనరులను క్రమపద్ధతిలో వాడుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. గత ఏడాది కాలంలో ఆన్ అండ్ ఆన్ పద్ధతిని అవలంబించిన ఇరిగేషన్ అధికారులు రా ష్ట్రంలో మంచి గుర్తింపు సాధించారు. తక్కువ నీటిని విడుదల చేసి ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టుకు నీళ్లను అందివ్వగలిగారు. ఇప్పుడు కూడా ఇదే విధానాన్నిఅవలంబించాలని అధికారులు నిర్ణయించారు.