నిజాం షుగర్స్ పునరుద్దరణపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి
నిజామాబాద్,నవంబర్18(జనంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్, సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దీనిపైనా ఎంపి కవిత సమాధానం ఇవ్వాలన్నారు. పసుపు బోర్డు కోసం పోరాటం మంచిదే అయినా నిజాం షుగర్స్ కోసం ఎందుకు పోరాడడం లేదన్నారు. వ్వయసాయమంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. తెరాస సర్కారు నీళ్ల కోసమని నిధులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరిట నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కాళేశ్వరంలో కొబ్బరికాయ కొడితే నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై డీపీఆర్‌ను బయట పెట్టాలన్నారు. జిల్లాల ఏర్పాటు మొదలు ప్రాజెక్టుల నిర్మాణం తదితర విషయాల్లో అన్నింటా ఏకపక్ష నిర్ణయాలే తీసుకోవడం కెసిఆర్‌కే చెల్లిందని అన్నారు. విమర్శలు వస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని అన్నారు. విమర్శలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సిఎం కెసిఆర్‌పై ఉందన్నారు.