నిజాం సాగర్‌ను గత పాలకుల పట్టించుకోలేదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల మద్దతు చూస్తే అఖండ విజయం ఖాయమని తెలుస్తోందని జుక్కల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల గుండెల్లో ఉన్న టీఆర్‌ఎస్‌దే విజయం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను గత పాలకులు ఏనాడు కూడా పట్టించుకోలేదని, తద్వారా ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ప్రాజెక్టులో కలకాలం నిండుగా నీరుండేలా సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పనులు చేపట్టారని గుర్తు చేశారు. అది పూర్తయితే వచ్చే ఏడాది నుంచి ఆయకట్టు పంటలకు పుష్కలంగా నీరందుతుందన్నారు. నాలుగేళ్లలో నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. తాను గతంలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆంధ్ర పాలకులు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఇంటి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి టీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన జుక్కల్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూస్తే గతంలో ఎన్నడూ లేనంత సంతృప్తిగా ఉందన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, అందుకే ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామని ప్రతిజ్ఞలు, తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. మండలంలో నాగమడుగు మత్తడి ఎత్తిపోతల పథకం ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే

రెండింతల అభివృద్ధి జరుగుతుందన్నారు.