నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు
నిజామాబాద్,మే25(జనంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు చేస్తున్నారు. దీని నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా వాస్తవ ఆయకట్టు 2,31,339 లక్షల ఎకరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల చిన్నచూపుతో ఈ చారిత్రక ప్రాజెక్టు ఉనికిని కోల్పోతూ వచ్చింది. మహారాష్ట్రలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టుల నిర్మాణాలతో నిజాంసాగర్‌కు కొన్ని దశాబ్దాలుగా ఆడపాదడపా తప్ప ఇన్‌ఫ్లోలు రావడం లేదు. కాళేశ్వరం పూర్తయితే గోదావరిని ఇందులోకి తరలిస్తామని అంటున్నారు. 2013లో 20 టీఎంసీల వరద రావడంతో రిజర్వాయర్‌లో 17.80 టీఎంసీల నిల్వ ఉంచి రెండు టీఎంసీలు దిగువకు వదిలారు. గత ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీస్థాయి వరద వచ్చింది. సుమారు 51 టీఎంసీల సర్‌ప్లస్ రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ ఉంచి మిగతాది దిగువకు వదిలింది. నిజాంసాగర్ నుంచి అలీసాగర్ రిజర్వాయర్ వరకు 90 కిలోవిూటర్ల ప్రధాన కాలువ ఉంది. దానిపై 49 డిస్టిబ్యూట్రరీలు ఉన్నాయి. అధికారులు తొలుత అన్ని డిస్టిబ్యూట్రరీలను మూసివేసి… నేరుగా అలీసాగర్ రిజర్వాయర్‌ను నింపారు. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలపై ఆధారపడకుండా ఉండాలని ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో చేపట్టిన మల్లన్నసాగర్ నుంచి ప్యాకేజీ-14, 17, 18 ద్వారా హల్దీ నది నుంచి నిజాంసాగర్‌ను నింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ వర్షాకాలంలోనూ దీని సామర్థ్యం పెంచేలా ప్రణాళికగా వ్యవహరిస్తున్నారు. నీరు వృధా కాకుండా నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.