నిజాం సేవలు గుర్తించే తెలంగాణకు భద్రాచలం

2

హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి): ”1959కి ముందు భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలా ? లేక ఆంధ్రాలో కలపాలా ? అనే విషయంలో పూర్తి ఆయోమయం ఏర్పడింది. ఆ సమయంలో నిజాం కాలం నాటి పరిస్థితిని అధ్యయనం చేశాం. నిజాం రాజులు నాడు భద్రాద్రి రాముడికి సేవలందించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఆలయం ఉన్న భద్రాచలం పట్టణాన్ని తెలంగాణలో ఉంచి, మిగతా రెవెన్యూ డివిజన్‌ ప్రాంతాన్ని ఏపీలో కలిపాం” అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ తెలిపారు. నిజాం పాలనలోని మంచి అంశాలను ఎప్పటికీ తాము గౌరవిస్తామని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ డెక్కన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ వసంత్‌కుమార్‌ బావా రచించిన ‘ది నిజాం బిట్వీన్‌ మొగల్స్‌ అండ్‌ బ్రిటీష్‌ (హైదరాబాద్‌ అండర్‌ సాలార్‌జంగ్‌-1)’ పుస్తకావిష్కరణ సభను హిమాయత్‌నగర్‌లోని ఉర్దూహాల్‌లో శనివారం నిర్వహించారు. జైరామ్‌ రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. విభిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్‌ నగరం నిజాం హయాంలో కూడా లౌకికతత్వానికి మారుపేరుగా, దేశ లౌకిక తత్వానికి హైదరాబాద్‌ ఒక చిహ్నంలా నిలిచిందని అన్నారు. నెహ్రూ, అంబేద్కర్‌, రాజాజీలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించేవారని, అయితే నాడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఏపీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో నెహ్రూ తన వైఖరిని మార్చుకుని అంగీకరించారని గుర్తు చేశారు.నాడు రెండు ప్రాంతాలను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పేరు విషయంలో పేచీ ఏర్పడిందని, ఆంధ్ర-తెలంగాణ పేరుతో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారని, అయితే ఆ సమయంలో కొందరు ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ అని పేరు మార్చబడిందని వివరించారు. విభజన సమయంలో రెండు ప్రాంతాల వారు తనపై ఆరోపణలు చేశారని, అయినప్పటికీ రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం పాటుపడ్డానని చెప్పారు. రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో సమతుల్యత పాటించడం దాదాపు అసాధ్యమని, ఏదో ఒక విషయంలో కొంత అసమానత ఉంటుందన్నారు. పుస్తక రచయిత వసంత్‌కుమార్‌ బావా, సెంటర్‌ ఫర్‌ డెక్కన్‌ స్టడీస్‌ సెక్రటరీ సజ్జద్‌ షాహీద్‌, రాణీ బావా, ఎం.వేదకుమార్‌, రత్నమాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.