నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

నిజామాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఈదురగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. ముఖ్యంగా మాక్లూర్‌, డిచ్‌పల్లి,నందిపేట్‌, నిజామాబాద్‌, నవీపేట, బోధన్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో తమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతున్నారు. తోటల్లో మామిడి పిందెలు రాలిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి సుమారు నాలుగు గంటలపాటు కురిసిన వర్షంతో తీవ్ర విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దాంతో రహదారుల వెంబడి చీకట్లు అలుము కున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనాలకు ఇక్కట్లు తప్పలేదు. వడగండ్ల వర్షంతో పంట నష్టం బాగా వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలు వీచడంతో చాలా చెట్లు నేలకూలాయి. సోమవారం ఉదయం విద్యుత్తు అధికారులు కరెంట్‌ స్తంబాలను సరిచేశారు. మున్సిపల్‌ అధికారులు చెట్లను రోడ్ల మధ్యలోనుంచి పక్కకు తీయించారు.