నిజామాబాద్ కలెక్టరుకు ప్రధానమంత్రి అవార్డ్
ఈ-నామ్ (ఎలక్ట్రానిక్-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానం అమలులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఈ-నామ్ అమలులో అత్యుత్తమ సేవలకుగాను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు దక్కింది. ఢిల్లీలో ఇవాళ జరిగిన సివిల్ సర్వీస్ డేలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణాకు ఈ అవార్డుని ప్రదానం చేశారు. అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, రూ.10 లక్షల నగదును అందజేశారు.
రైతు తన పంటను జాతీయ స్థాయిలో అమ్ముకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్ విధానం తీసుకొచ్చింది. ఈ-నామ్ అమలులో మంచి పనితీరుకు గాను అవార్డు వరించింది. రైతులకు, తెలంగాణ ప్రభుత్వానికి అవార్డును అంకితమిస్తున్నట్లు యోగితారాణా ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉందని, మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సహా సిబ్బంది సహకారం వల్ల ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.
పారదర్శకంగా వ్యవసాయ మార్కెట్ ను నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ యోగితారాణా చెప్పారు. రైతులు నేరుగా పంటలను అమ్ముకోగలుగుతున్నారని, దళారుల ప్రమేయం తగ్గిపోయిందన్నారు. మార్కెట్లో అమ్మే 45 రకాల పంటల్లో ఎక్కువ శాతం పసుపు, సోయా పంటలు ఉన్నాయని, తూకం, బిల్లింగ్, ధరల సూచిక అన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిర్వహించామని వివరించారు. రైతుల్లో అవగాహన కలిగించడం ద్వారా ఈ-నామ్ లో అమ్మకాలు పెరిగాయని కలెక్టర్ వెల్లడించారు. విదేశాల నుంచి సైతం కొనుగోలుదారులు ఆన్ లైన్ ద్వారా నిజామాబాద్ మార్కెట్ నుంచి కొనుగోళ్ళు జరిపారని వివరించారు.
ఈ-నామ్ అమలులో ఉన్న 225 మార్కెట్ల నుంచి 14 మార్కెట్లను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వీటిల్లోంచి తుదిపోటీకి నిజామాబాద్, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ మార్కెట్ ఎంపికయ్యాయి. చివరికి నిజామాబాద్ మార్కెట్ విజేతగా నిలిచిందని కలెక్టర్ వివరించారు.
నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయస్థాయిలో మొదటి స్థానం దక్కినందుకు సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత అభినందనలు తెలిపారు.