నిజ జీవితంలో సకలాంగులకన్నా మీరే హీరోలు:మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్

:ఏ సమస్యనైనా చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటారని మీరే మాకు స్ఫూర్తి అని అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ చౌరస్తా నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించిన దివ్యాంగుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్టేడియం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులకు చిన్నచూపు ఉందని, అంటరాని వారీగా చూస్తున్నారని కొన్ని దివ్యాంగ సంఘాల ప్రతినిధులు తమ ఉపన్యాసంలో ప్రస్తావించిన విషయాలను గుర్తు చేస్తూ దేవుడు మీకు అపారమైన శక్తి ఇచ్చాడని, ఎవరేమనుకున్నా అనుకున్న లక్ష్య సాధన దిశగా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని విజయం వరిస్తుందని అన్నారు. పరిపాలన సంబంధమైన మీ సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటె జిల్లా న్యాయ సేవా సమితిని సంప్రదించి తెల్ల కాగితంపై దరఖాస్తు ఇస్తే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. వికలాంగత్వాన్ని జయించి ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించావారున్నారని, అదే స్ఫూర్తి, పట్టుదలతో ముందుకెళ్లాలని మీలో కూడా కోరిక ఉంటుందని, ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడాలని, అందుకు పూర్తి సహాకారం అందిస్తామని అన్నారు.
        స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ దివ్యాంగుల, వయోవృద్ధులు, , ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ జి.ఓ. జారీచేసిందన్నారు. గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైన వికలాంగుల వయోవృద్ధుల శాఖ ద్వారా భిన్న పధకాల అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి మరింత మెరుగైన సేవలు , సంక్షేమ కార్యక్రమాలు దరిచేరాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. తద్వారా ప్రత్యేక సిబ్బంది ఉంటారని, మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటకు అవకాశముంటుందని అన్నారు. 2016 చట్టం ద్వారా వికలాంగుల కోసం ఉన్న హక్కులపై శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కలిగిస్తామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికలాంగులలో పట్టుదల, ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందని, ఏ సమస్య వచ్చిన ఎవరిపై ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకెళతారని ప్రశంసించారు.
      మహిళాశిశు , వికలాంగుల, వయో వృద్దుల సంక్షేమాధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ జిల్లాలో 12,986 మంది దివ్యాంగులున్నారని, వారి సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు పరుస్తున్నామని అన్నారు అవసరమైన వారికి ఆలింకో సంస్థ ద్వారా వీల్ ఛైర్లు, కృత్రిమ అవయవాలు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు వంటివి అందిస్తున్నామన్నారు. కులాంతర వివాహక ప్రోత్సాహాకాలు, బ్యాంక్ లింకేజి, రాయితీపై బస్సు పాస్ సౌకర్యం కలిస్తున్నామని అన్నారు.
       డిఆర్ డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 8,734 మంది దివ్యాంగులకు ప్రతి నెల ఆసరా పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరంలో 24 సదరం క్యాంపులు నిర్వహించి 1410 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులైన 540 మందికి వికలాంగత్వ సర్టిఫికెట్ లను అందించామన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద 1,532 వికలాంగులకు జాబ్ కార్డులు అందించి 38 వేల పనిదినాలు కల్పించామన్నారు. వివిధ వృత్తులలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. మనం అనుభవిస్తున్న ఫలాలను తోటి వారందరికీ అందేలా చూడాలని వికలాంగులకు సూచించారు.
అనంతరం రాష్ర స్థాయిలో జరిగిన పరుగు, జావెలిన్ త్రో లో గెలుపొందిన కవిత, ప్రసాద్, ట్రై సైకిల్ రేస్ లో విజేత యాదగిరి నవీన్ లకు అదనపు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జరిగిన పరుగు పందెం, షాట్ ఫుట్, ట్రై సైకిల్ రేస్, జావెలిన్ త్రో, చెస్, క్యారం వంటి ఆటల పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ విజేతలకు ప్రశంసాపత్రం, బహుమతులను అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అందజేశారు.
       ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదులు, డీఈఓ రమేష్ కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా, వివిధ దివ్యంగుల సంఘాల నాయకులు అశోక్, స్వామీ, రియాజుద్దీన్, సాయిలు, యాదయ్య, సంతోషి, సి.డి.పి .ఓ.లు, ఎపిఎం లు తదితరులు పాల్గొన్నారు.