నిధులు కొరత లేకుండా కళ్యాణలక్ష్మి అమలు
నిజామబాద్,మే31 : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల విడుదలతో ఇప్పుడు సమస్యలు లేకుండా పోయాయి. దీంతో ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి నిధులు అందచేస్తున్నారు. నిధుల లేమితో ఆగిపోయిందన్న అపప్రథ లేడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత, గిరిజన యువతుల పెళ్లిళ్లకు ఆపన్న హస్తంగా మారిన ఈ రెండు పథకాలకు నిధులను కేటాయించింది. సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసి వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. కొంతమంది సకాలంలో నిధులు అందకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి తేదీ దగ్గర పడటంతో నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం నిధులు రావడంతో వందల సంఖ్యలో ఉన్న లబ్దిదారుల ఖాతాలలో ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నిధులు వేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్‌సీ సంక్షేమ శాఖకు రూ. ఐదు కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతానికి రూ.75 లక్షలను మాత్రమే విడుదల చేసింది. విడుతలవారీగా నిధులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి ఒక్కరికీ పథకం ద్వారా సాయం అందచేస్తున్నామని అన్నారు.