” నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐవివై ఆసుపత్రి పై కేసు నమోదు.”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పాపానికి నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ స్థానంలో నర్స్ వైద్య చికిత్సను అందించి ఓ మహిళ గర్భస్రావానికి కారణభూతమైన కొండాపూర్ ఐవివై లీఫ్ ఆస్పత్రి పై మాదాపూర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా కపిలేశ్వరపురం అంగర గ్రామానికి చెందిన చౌదరి బ్రతుకుతెరువు నిమిత్తం నగరానికి వచ్చి కొండాపూర్ ప్రాంతంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఈనెల 26వ తేదీన తన భార్యకి కడుపునొప్పి రావడంతో సమీపంలోని ఐవివై లీఫ్ ఆసుపత్రికి రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లడం జరిగింది. అయితే అప్పుడు డాక్టర్ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకున్న నర్స్ డాక్టర్ సలహా మేరకు వైద్య చికిత్స నిర్వహించింది. దీంతో కొద్దిసేపటికి గర్భిణీ అయిన చౌదరి భార్యకి గర్భస్రావం కావడంతోపాటు పుట్టిన మగ శిశువు మృతి చెందడం జరిగింది. చౌదరి ఫిర్యాదుమేరకు మాదాపూర్ పోలీసులు ఆసుపత్రి పై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.