నియోజకవర్గానికో యార్డు

ప్రతిపాదనలు సిద్దం చేసిన సర్కార్‌

అమరావతి,నవంబరు 26(జనం సాక్షి): ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యార్డు ఉండేలా కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు నగర ప్రాంతాల్లోని 12 యార్డులను గ్రావిూణ ప్రాంతాలకు తరలించాలని అధికారులు ప్రతిపాదించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 191 మార్కెట్‌ యార్డులతోపాటు కొత్తగా ఏర్పాటుచేసే 22 యార్డులకు కొత్త పాలకవర్గాలను త్వరలో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత యార్డులకు పాలకవర్గాలను నియమించడంతో పాటు కొత్తగా 22 మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నది. వచ్చే కేబినెట్‌ సమావేశంలో వీటిపై చర్చించి, కొత్త కమిటీల ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. యార్డు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు పాటించనున్నారు. చైర్మన్‌ పోస్టులకు కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కొత్త మార్కెట్‌ కమిటీల్లో.. విజయనగరం జిల్లా మెరకముడిదాం, విశాఖ జిల్లా పెందుర్తి, మాడుగుల, అరకు వ్యాలీ, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు, గుంటూరు జిల్లా గురజాల, ప్రత్తిపాడు, దుర్గి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి, చిత్తూరు జిల్లా చంద్రగిరి, కలికిరి, కడప జిల్లా ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లా కోడుమూరు, మంత్రాలయం, పాణ్యం, అనంతపురం జిల్లా శింగనమల, రాప్తాడు, పుట్టపర్తి, గోరంట్ల ఉన్నాయి.