నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌
బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి):
సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ పర్చింది. సీమాంధ్ర సర్కార్‌ సమర్థవంతంగా వాదన వినిపించలేకపోవడం వల్లే వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్న ఆరోపణలున్నాయి. ఏడేళ్ల అనంతరం మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు విలువరించింది. ముగ్గురి సభ్యలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఈ తీర్పు వెలువరించింది. బాబ్లి ప్రాజెక్టును అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని దీన్ని వెంటనే నిలిపివేయా లంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వినోద్‌తోపాటు పలువురు సుప్రీంను ఆశ్రయించారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు తన తుది తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న వాదనలు చేయడం సరికాదని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 2008 మార్చి 26న సుప్రీం కోర్టు బాబ్లీ అంశంపై విచారించేందుకు అంగీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారించిన సుప్రీం కోర్టు ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర జలవనరుల సంఘం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన ముగ్గురితో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తోంది. అయితే సుప్రీం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూనే 2.47 టీఎంసీల నీటిని వాడుకోవాలని షరుతు విధించింది. ఆంధ్రప్రదేశ్‌ అవసరాల కోసం బాబ్లి ద్వారా నిల్వ చేసిన నీటిని 6 టీఎంసీల నీటిని కచ్చితంగా విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ బాబ్లిపై పరిశీలనకు వేసిన త్రిసభ్య కమిటీ నిర్వహణకు అయ్యే ఖర్చును మహారాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.