నిరుపయోగంగా పరికరాలు

కోట్ల రూపాయల ఖర్చు చేసినా వ్యర్థం
ఒంగోలు,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రభుత్వ నిధుల వ్యయంపై ఉన్న శ్రద్ధ వినియోగంలో కనిపించటం లేదు. ప్రభుత్వ శాఖలలో నిధులు వ్యయం చేసి ఏమైనా కొనుగోలు చేయాలంటే ఎంతో ఉత్సాహంగా పనిచేసే అధికారులు వాటిని సరైన పద్ధతిలో వినియోగించడంలో అశ్రద్ధ చూపుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి స్వచ్ఛభారత్‌ మిషన్‌ పేరుతో జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం కోసం కొనుగోలు చేసిన పరికరాలు కనీసం వినియోగంలోకి రాకుండా మూలనపడి శిథిలమవుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన రిక్షాలు, చెత్త బుట్టలు, ఇతర పరికరాలు పంచాయతీ కార్యాలయాలలో, మండల పరిషత్‌ కార్యాలయాలలో మగ్గి పనికిరాకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రావిూణ సవిూకృత అభివృద్ధి పథకం కింద ఎంపిక చేసిన 112 గ్రామ పంచాయతీలకు ఆయా పంచాయతీల జనాభాను బట్టి చెత్త తరలింపు కోసం ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేయగా జిల్లాలో ఉన్న 1028 గ్రామ పంచాయతీలలో చెత్త తరలింపు కోసం 1200 చెక్క రిక్షాలను స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రావిూణ ) కింద కొనుగోలు చేశారు. అదేవిధంగా అన్ని పంచాయతీలలో తడి , పొడి చెత్త విధానాన్ని అవలంభించి చెత్త నుంచి సంపద సృష్టించాలన్న సంకల్పంతో కుటుంబానికి 2 చెత్త బుట్టల చొప్పున సరఫరా చేసేందుకు చెత్తబుట్టలు కొనుగోలు చేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో ప్రతి కుటుంబానికి 2 చెత్తబుట్టలు అందజేసేందుకు వీలుగా 25 లక్షలకు పైగా చెత్తబుట్టలను కొనుగోలు చేశారు. ట్రాక్టర్లు, ఆటోలు, చెక్క రిక్షాలు, చెత్త బుట్టల కొనుగోలు కోసం 20 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు
సవిూపిస్తున్న సమయంలో అప్పటి జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవోలు కమిటీ సభ్యులుగా ఈ కొనుగోలు కార్యక్రమాన్ని హడావుడిగా ముగించారు. వాస్తవ ధరకన్నా అదనంగా వెచ్చించి ఈ కొనుగోళ్లు చేయటంతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. నిధుల వినియోగంలో చేతివాటం సంగతి అలా ఉంచితే కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఏ ఒక్క పరికరాన్ని కూడా కనీసం ఒక్క పంచాయతీలో కూడా వినియోగించకపోతుండటం ప్రజాధనం పట్ల అధికారుల్లో అడుగడుగునా ఉన్న నిర్లక్ష్య ధోరణిని బహిర్గతం చేస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేవరకు చెక్క రిక్షాలు, చెత్తబుట్టలు మండల పరిషత్‌ కార్యాలయాల్లోనే ఉండిపోగా ఎన్నికల ఫలితాల అనంతరం కొంత మేరకు చెత్త బుట్టలు, చెక్క రిక్షాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తరలించారు. ఇప్పటికీ అనేక పంచాయతీలకు సంబంధించిన పరికరాలు మండల కార్యాలయాల్లోనే ఉన్నాయి. వీటిని ఉపయోగించి సేకరించే చెత్తను కంపోస్టుగా మార్చి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో లక్షలు వెచ్చించి ప్రతి పంచాయతీలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు సైతం గ్రామాలలో అలంకార ప్రాయాలుగా మారి అధికారులను వెక్కిరిస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులతో హడావుడిగా కొనుగోలు చేసిన ఫాగింగ్‌ మిషన్లదీ అదే దారిగా కనిపిస్తోంది. గడచిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసే సమయంలో వారు హడావుడిగా బిల్లులు క్లియర్‌ చేసుకుని నిధులు డ్రా చేసుకోవటంపై శ్రద్ధ చూపించగా ఇదే అదనుగా ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు ఆర్థిక సంఘం నిధులతో ప్రతి పంచాయతీకి ఓ ఫాగింగ్‌ యంత్రం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను ఎలాగోలా ఖర్చు చేసి వెళ్లాలన్న ఆలోచనతో సర్పంచ్‌లు కొన్ని బిల్లులు చేయించుకోవటంతో పాటు అధికారులు చెప్పిన ఫాగింగ్‌ యంత్రాలు కూడా కొనుగోలు చేశారు.