నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలినిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలి-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 16 (జనం సాక్షి);
నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పోడు భూములు, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, తెలంగాణకు హరితహారం, రెండు పడక గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.  ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశము హాలు నుండి పాల్గొన్నారు.సి.ఎస్. మాట్లాడుతూ, జిల్లాలో కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల శ్రద్ద వహించాలని, రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని శిబిరాల వద్ద అవసరమైన చల్లని నీరు, ఓఆర్ఎస్  ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం వంటి ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని అన్నారు.  జిల్లాలకు కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ జరుగుతుందని, వాటిని సదరు లబ్దిదారులకు అందించిన తరువాత లబ్దిదారుని ఫోటో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణ ప్రాంతాలలో నిర్మించిన 42 వేలకు పైగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులను కేటాయింపు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6 వేల 620 మాత్రమే జరిగిందని, ఫిబ్రవరి 26 నాటికి పెండింగ్ లో ఉన్న ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. ప్రభుత్వం అందించిన ఫ్రోఫార్మా 1 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమాచారం త్వరితగతిన అందించాలని, అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు నివేదిక తయారు చేయాలని  తెలిపారు. పోడు భూముల పట్టాల పంపిణీ కొరకు జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు త్వరగా ఆమోదించాలని సూచించారు.  జిల్లాలో ఆమోదించిన దరఖాస్తులో పట్టాదారు ఫోటో, ఇతర వివరాలు పాలిగాన్ చెక్ చేసి, సరిగ్గా ఉన్న దరఖాస్తులు వెంటనే పట్టా పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలని అన్నారు. తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే సంవత్సరంలో అవసరమైన మొక్కల పెంపకం నర్సరీలో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. జిల్లాలో మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు పక్కాగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని మొక్కల సంరక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా జీఓ 58 ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పట్టాలను స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.  పెండింగ్ దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేయాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్  అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,   కంటి వెలుగు కింద ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు ఎప్పటి కప్పుడు అందించాలని, జిల్లాకు వచ్చిన ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఏ.ఎన్.ఎం. ల వారీగా విభజించి లబ్దిదారులకు పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.  జీఓ 58, 59, 76, 118 సంబంధిత దరఖాస్తులపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్,  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ, డాక్టర్ సిద్దప్ప,  అసిస్టెంట్ డి.ఆర్.డి.ఓ.నాగేంద్రం  సుపరింతెన్దేంట్ రాజు,అటవీ శాఖ అధికారి  దేవరాజు , పవన్  తదితరులు పాల్గొన్నారు