నిర్విఘ్నంగా చండీ మహాయాగం , తరలి వస్తున్న భక్తులు
విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వేద మంత్రాల ఘోషతో ఐదో రోజు ఎర్రవల్లి ప్రాంతం మార్మోగుతున్నది. పూర్ణాహుతి హోమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ ప్రత్యేకంగా పంపించిన పట్టు వస్త్రాలను ధరించిన సీఎం కేసీఆర్ అయుత చండీ మహా యాగంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. యాగం ముగింపు రోజు కావడం, సెలవుదినం కావడంతో ఎర్రవల్లి దారులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజామునుంచే యాగస్థలికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
అయుత మహా చండీయాగం జరుగుతున్న యాగస్థలి ఎర్రవల్లికి ప్రజలు, భక్తులు బారులు తీరారు. చలిని, శీతల గాలులను సైతం లెక్కచేయకుండా ఎర్రవల్లికి తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున బారులు తీరారు. క్యూలైన్ల ద్వారా భక్తులు యాగశాల, చండీమాతను దర్శించుకుంటు దేవీ ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మవారి నామస్మరణతో యాగస్థలి మార్మోగుతుంది. భక్తుల రద్దీ కారణంగా నిర్వాహాకులు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయుత చండీయాగం నేటి పూర్ణాహుతితో పరిసమాప్తం కానుంది. ముగింపు కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.