నిలిచిన కేసీఆర్‌ సభ


` నేటి సీఎం వరంగల్‌ పర్యటన రద్దు
` ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో కోడ్‌ అమలు
హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ముహూర్తం కలిసి రావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో సీఎం కేసీఆర్‌ వరంగల్‌ నగర పర్యటన రద్దయింది. బుధవారం 10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయిం చారు. సీఎం సభకు అధికారులు ఏర్పాట్లు చేసారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కోడ్‌ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయింది. ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభ సభపై సందిగ్దం ఏర్పడిరది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈనెల 29న నిర్వహించే విజయ గర్జన సభ మరోసారి వాయిదా పడినట్లేనని అంటునారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . ఈ మేరకు ఈనెల 15న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మొదటి టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. కానీ దీక్షదీవస్‌ను పురస్కరించుకుని ఈనెల29న నిర్వహిస్తే బాగుంటుందని వరంగల్‌ జిల్లా నేతలు సూచనతో 29 నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేసి సభా స్థలాన్ని సిద్దం చేశారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు (మంగళవారం) నోటిషికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో విజయ గర్జన సభ మరోసారి వాయిదా పడిరది. అలాగే బుధవారం నాటి కేసీఆర్‌ పర్యటన రద్దయింది.