నిలిచిన బస్సులు

– రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రభావం
– ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా కానరాని ఫలితం
– అడ్డకుకుంటున్న కార్మికులు, పలు ప్రాంతాల్లో డిపోల ఎదుట ఆందోళన
– ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు
– పలు ప్రాంతాల్లో బస్సులపై రాళ్లదాడి
– సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కతగ్గమంటున్న కార్మిక సంఘాలు
– ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రైవేట్‌ వాహనదారులు
హైదరాబాద్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు యత్నించగా.. కార్మికులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ ప్రయాణికులను ఆదుకోలేక పోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌ల వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు. పలు జిల్లాలో పోలీస్‌ల భద్రత నడుమ అధికారులు ప్రైవేట్‌ బస్సులను, స్కూల్‌ బస్సులను నడిపించారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వం మెట్రో ట్రిప్పులను పెంచింది. దీంతో నగరవాసులు మెట్రోను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్‌లు ప్రయాణీకులతో కిక్కిరుస్తున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసుల భద్రత నడుమ అధికారులు బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పలు ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవేట్‌ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ డ్రైవర్లను, కండక్టర్లను విధుల్లోకి తీసుకొని బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. పోలీసుల భద్రత నడుమ ప్రైవేట్‌ డ్రైవర్లతో పాక్షికంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలోకి పోలీసులు ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది కోసం ఆర్టీసీ అధికారుల ఇచ్చిన నోటిపికేషన్‌తో ప్రయివేట్‌ డ్రైవర్లు జేబీఎస్‌కు చేరుకోవటంతో ఆర్టీఏ అధికారులు వారికి ట్రయల్‌ రన్‌ నిర్వహించిన తర్వాత వారికి బస్సులు అప్పగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌, క్యాబ్‌లు అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌  ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దిల్‌సుఖ్‌ నగర్‌ డిపోలో 110 సిటీ బస్బులు నిలిచిపోయాయి. అయితే డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. అదిలాబాద్‌ జిల్లాలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అయితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకు ప్రయివేట్‌
డ్రైవర్ల సహాయంతో 18 బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. ఉమ్మడి అదిలాబాద్‌లో ఆరు డిపోలల్లో 185 అద్దె బస్సులు ఉన్నాయని, ఆర్టీసీ బస్సులు 140, అద్దెబస్సులు 160 వరకు తిరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం తాత్కాలిక ప్రైవేట్‌ డ్రైవర్లను, కండెక్టర్లను నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డిపోలు, బస్టాండ్‌లవద్ద పోలీసులు పూర్తి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.
వరంగల్‌ రీజియన్‌ పరిధిలో తొమ్మిది డిపోలలోని 972 ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 4200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బస్టాండ్లు, డిపోల ముందు పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మహుబూబాబాద్‌ బస్టాండ్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న పది మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో సమ్మె ప్రభావంతో 670 ఆర్టీసీ, 182 అద్దె బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 3200 మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92బస్సులను అధికారులు నడిపించఆరు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా 10 డిపోలలో 909 ఆర్టీసీ, 209 అద్దె బస్సులు నిలిచిపోయాయి. 3900 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రయివేట్‌, స్కూల్‌ బస్సులను నడిపేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ హెచ్చరికలతో కొంత మంది కార్మికులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి హెచ్చరికలకు భయపడేది లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో 880 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు భైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్‌ కర్నూల్‌ డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి బస్సు డిపో ముందు కార్మికులు బస్సులు కదలకుండా బైఠాయించారు. అయితే  పోలీసుల సహకారంతో
కొన్ని ప్రయివేట్‌ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. నారాయణ పేట జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. అయితే ఆర్టీసీ అధికారులు ప్రయివేట్‌ వ్యక్తులతో పాక్షికంగా బస్బులను నడిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోలు, బస్టాండ్‌ల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మెదక్‌ ఉమ్మడి జిల్లాలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. మెదక్‌ రీజియన్‌లోని 8డిపోల్లో 672 ఆర్టీసీ, 190 అద్దె బస్సులు నిలిచిపోయాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ అద్దె బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. నల్లగొండ ఉమ్మడి  జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే అన్ని డిపోల ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని పోలీసులు వారిని హెచ్చరించారు. వికారాబాద్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వికారాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రయివేట్‌ డ్రైవర్లతో బస్సులు నడిపించారు. పోలీసుల భద్రత నడుమ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు బయటికి వవచ్చాయి. దీంతో డిపోకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కార్మికుల నినాదాలు పోలీసుల పకడ్బందీ మధ్య
సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. ఖమ్మం డివిజన్‌ పరిధిలో మొత్తం 449 ఆర్టీసీ, 183 ప్రయివేట్‌ బస్సులు సమ్మె కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా డిపో, బస్టాండ్‌ పరిధిలలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించిన అధికారులు పలు బస్సులను నడిపించారు.
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు – ఆర్టీసీ ఐకాస
ప్రభుత్వం విధించే డెడ్‌లైన్లకు కార్మికులు బెదరబోరని తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు. సమ్మె విషయంలో వెనక్కి తగ్గబోమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు నేతలు ఎంజీబీఎస్‌ను సందర్శించారు. సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారని వారు అన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెతో కార్మికులు నైతిక విజయం సాధించారని ఈ సందర్భంగా ఐకాస నేతలు పేర్కొన్నారు.
ప్రైవేటు డ్రైవర్లతో పాక్షికంగా నడుస్తున్న బస్సులు
ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి..
వికారాబాద్‌ జిల్లా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరారు. బస్సు అద్దాలు పగిలిపోయాయి. వెనుక పోలీసు వాహనం సెక్యూరిటీగా వస్తున్నప్పటికీ బస్సు వస్తున్నా బస్సుపై రాళ్లు విసిరిన దుండగులు బైక్‌ పై పరారయ్యారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పగిలి..ప్రయాణీకులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న క్రమంలో వారే బస్సుపై రాళ్లు విసిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లేపల్లి ప్రధాని రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై ఓ వ్యక్తి రాళ్లు విసిరాడు. పెద్దపల్లి నుంచి భూపాల పల్లి వెళ్తున్న బస్సుపై  రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలుడి తలకు గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని స్థానిక హాస్పిటల్‌ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.  అనంతరం
బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న క్రమంలో ప్రభత్వం పోలీసులు సెక్యూరిటీతో బస్సులను నడిపిస్తున్నందుకు ఆర్టీసీ కార్మికులే బస్సులపై దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్‌ దోపిడీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవటంతో ప్రైవేట్‌ వాహనదారులు ప్రయాణీకులను దోచుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ వాహనాలే ప్రయాణీకులకు దిక్కుకావటంతో వారు అడిగినంత ఇవ్వాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.500లకు పైగా ప్రైవేట్‌ వాహనదారులు వసూళ్లు చేస్తున్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.600లకు పైగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో పండుగ సమయంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. కరీంనగర్‌ నుండి హైదరాబాదుకు ఏడు వందల రూపాయల వరకు వసూళ్లు చేస్తుండగా, నలభై తొమ్మిది కిలోవిూటర్ల దూరం ఉన్న జగిత్యాలకు 150 రూపాయలు ప్రైవేట్‌ వాహన దారులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్‌ బస్సులు, స్కూల్‌ బస్సులను నడిపిస్తున్నప్పటికీ అవి
ఏమాత్రం సరిపోకపోవటంతో బస్టాండ్‌ల వద్ద ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. వచ్చిన రెండుమూడు బస్సులు కిక్కిరుస్తుండటంతో మహిళలు, చిన్న పిల్లలు ప్రయాణం సాగించేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు.

తాజావార్తలు