నిల్వ నిధులు వెనక్కి

తలలు పట్టుకున్న అధికారులు
విజయనగరం,నవంబర్‌9 (జనం సాక్షి):  ఆర్థికలోటుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న జిల్లా వైద్యఆరోగ్య శాఖకు ప్రభుత్వ నిర్ణయంతో కొత్త చిక్కు వచ్చిపడింది. గతంలో మంజూరై నిల్వ ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఏఏ పద్దుల్లో ఉన్న నిధులను వెనక్కు పంపించాలో కూడా సూచించింది. దీంతో
జిల్లా నుంచి రూ.6 కోట్ల 25 లక్షలు తిరిగి పంపించారు. మరికొన్ని పద్దుల నిధులు కూడా ఎప్పుడు పంపించాలో మళ్లీ సూచిస్తామని ప్రభుత్వం చెప్పడంతో నిర్వహణ ఎలా అని జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొదటి దశలో రూ.6.25 కోట్లు వెనక్కు పంపించేశారు. తాజా పరిణామంతో వైద్య శాఖలో మరింతగా నిధుల కొరత ఏర్పడింది. కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఈ నిధుల నుంచే ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా అత్యవసర మందులు, ఆసుపత్రి నిర్వహణతో పాటు మరికొన్ని సేవల కోసం గతంలో వచ్చిన రూ.5 కోట్లు కూడా ఎప్పుడు వెనక్కి ఇవ్వాలో ఆదేశాలిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. అంటే ఈ నిధులను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు చేసే పరిస్థితి లేదు. సరెండ్‌ చేసిన నిధులను ప్రభుత్వం సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా తిరిగి మంజూరు చేస్తామని చెబుతోంది. ఈ పక్రియకు ఎన్నాళ్లు పడుతుందోనని వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖకు గతంలో వచ్చిన నిధులను విధి లేని స్థితిలో తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు. మరో వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆపరేషన్‌ బ్జడెట్‌ అరకొరగా ఉన్న కారణంగా సేవలు అందించలేని పరిస్థితి ఉంది. జిల్లాలో 68 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అన్నిచోట్లా ప్రభుత్వం మంజూరు చేసిన బ్జడెట్‌ చాలటం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇదే బ్జడెట్‌ను అందిస్తున్నారు. పెరుగుతున్న ధరలు.. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా నిధుల పెంపు లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు అందించిన నిధులను మళ్లీ వెనక్కు తీసుకుంటున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరిగి మంజూరు చేసేటపుడు బ్జడెట్‌ను పెంచాలని కోతున్నారు.