నీలం బాధితులకు … ఓదార్పుతో సరి …?

నీలం తుఫాన్‌ ఎన్నో నష్టాలను మిగిల్చింది. ఎందరికో గుండెకోతను మిగిల్చింది. ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో రైతులు కోలుకోలేదు. ఉన్నది ఊడ్చిపెట్టుకుపోయింది. వరద ముప్పును ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాం..? ముందే ఎందుకు ఊహించ లేకపోయాం.. ఆ దిశగా ప్రయత్నలోపం ఉందా… అన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. నీలం దెబ్బకు ప్రజలు తల్లడిల్లుతున్నా కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటు. నీలం దెబ్బకు నష్టపోయినా ఇప్పటికీ కేంద్ర సాయం అందలేదు. కనీసం 1550 కోట్లు విడుదల చేయాలని సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తాజాగా కేంద్రాన్ని కోరారు. మంత్రులు, కేంద్రమంత్రులు, సిఎం వచ్చి బాధితులను ఓదార్చారే తప్ప సాయం అందించిన దాఖాలాలు లేవు. కరువు, వరదలు వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు జరుగుతోంది.

ఇప్పుడు అక్క పశుగ్రాసానికి కూడా కరువు ఏర్పడబోతోందన్న రైతుల ఆక్రందనను పట్టించుకున్నవారు లేరు. వరదలు ఒక్కసారిగా పరుగెత్తుకు వచ్చేవి కావు. భారీ వర్షాలు వస్తున్నాయని తెలిసీ అధికారులు ఎందుకు స్పందించలేదన్నది ప్రశ్న. అలాగే కేంద్ర జల వనరుల శాఖ అధికారులు ముందే ఎందుకు స్పందించ లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. వారు సకాలంలో స్పందించి వుంటే కొంతలో కొంతైనా నష్ట నివారణ జరిగి ఉండేదన్న వాదనలూ ఉన్నాయి. అయితే వరద పెద్ద ఎత్తున రావడం, ఊహించని విధంగా సముద్రం పోటెత్తడం వల్ల  ఉపద్రవం జరిగిందనేది అధికారుల వాదన. సకాలంలో అధికారులు హెచ్చరించలేదని మంత్రి రఘువీరా స్వయంగా అన్నారు. అంటే సాంకేతిక అభివృద్ది జరిగినా అప్రమత్తంగా లేమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సముద్రగర్భంలో భూకంపాలను కనిపెట్టి, సునావిూ రాకలను పసిగట్టే శాష్తీయ్ర విజ్ఞానాన్ని సాధించిన ఈ రోజుల్లో భారీ వర్షాలు వాటి తీవ్రత, వరదల గురించి ఎందుకు పసిగట్టలేక పోయామా అన్న సంశయం కలుగుతోంది. ఈ విషయంలో మనం ఫెయిల్‌ అయ్యామా అన్న సందేహం కూడా కలుగుతోంది.

నీలం తుఫాన్‌ సమయంలో ఇదే జరిగింది. ఇప్పటికీ అక్కడ అన్నదాతు ఆక్రందనలు చెందుతున్నా పట్టించుకోవడం లేదు.  ముందస్తు హెచ్చరికలు జరిగివుంటే నష్టం ఇంతగా జరిగేది కాదని అన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి అధికారుల సమన్వయ లోపం వల్ల జరగరాని నష్టం జరిగింది.  అధికారుల మధ్య సమన్వయం ఉండి వుంటే ఈ విపత్తు జరిగినా ప్రజలను రక్షించుకోగలిగే వారమని మేధావులు అంటున్నారు. అనావృష్టి గురించి ఆందోళన చెందినంతలోనే అతివృష్టి అతలాకుతలం చేసింది. తాత్కాలిక చర్యలు తీసుకోవడం తర్వాత వాటి గురించి పట్టించుకోక పోవడం వల్ల ఉత్పాతాలు వచ్చినప్పుడు భారీగా నష్ట పోతున్నాం. ఇక మనముందున్నది విపత్తు సాయం ఒక్కటే. రైతులను , ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలన్నది అధికారులు అంచనా వేయాల్సి ఉంది. ఖరీఫ్‌ పూర్తిగా దెబ్బతినగా వేసుకున్న కొద్దిపంట ఈ వరదలకు ఊడ్చుకుపోయింది. అధికారులు రైతులను.  ఓదార్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దళారీల ప్రమేయం లేకుండా అధికారులు నేరుగా బాధితులకు సాయం అందించాలి. ముందుగా వారికి బతుకుతామన్న ఆశలు, ధైర్యాన్ని కల్పించాలి. వెంటనే రైతులు లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలి. అప్పుడే వారిలో ఆశలు చిగురిస్తాయి.